Chandrababu: తాను స్వయంగా పిలిచిన అమిత్ షా రాత్రి సమావేశానికి ఎందుకు రాలేదు?: ఎంపీలను ప్రశ్నించిన చంద్రబాబు

  • అన్ని అంశాల్లో స్పష్టత రావాల్సిందే
  • ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ 
  • రెండు అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయన్న ఎంపీలు 
  • ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చించేందుకు న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గత రాత్రి అరుణ్ జైట్లీతో జరిగిన సమావేశానికి ఎందుకు రాలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఉదయం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, సమావేశానికి జైట్లీతో పాటు అమిత్ కూడా హాజరై ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

సమావేశం వివరాలను ఎంపీ తోట నరసింహం చంద్రబాబుకు వివరించగా, కేంద్రం నుంచి అన్ని అంశాల్లో స్పష్టత రావాల్సి వుందని, స్పష్టత వచ్చేంత వరకూ పోరాటం ఆపవద్దని ఆదేశించారు. రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ఆయన, పార్లమెంటులో హోదా కోసం నిరసనలు తెలియజేస్తూనే ఉండాలని సూచించారు. నిన్నటి సమావేశంలో 'పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం' అని మాత్రమే అరుణ్ జైట్లీ చెప్పారని, నిర్దిష్టమైన హామీలేవీ ఆయన్నుంచి రాలేదని ఎంపీలు చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

పరిస్థితి ఇలాగే ఉంటే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. హోదా, రైల్వే జోన్ అంశాలు అసలు చర్చకే రాలేదని, కేవలం రెండు అంశాలను మాత్రమే ప్రస్తావించి, మిగతావి వాయిదా వేశారని టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎంపీలు వెల్లడించారు. అన్నీ సాధించే వరకూ టీడీపీ వైఖరిలో మార్పు ఉండదని, ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలని కోరారు. 

More Telugu News