PNB: కొత్త కోణం... పీఎన్బీ అధికారులకు కోట్ల విలువైన బంగారు నాణాలు, వజ్రాభరణాలను లంచంగా ఇచ్చిన నీరవ్

  • పీఎన్బీని రూ. 12 వేల కోట్లకు ముంచేసిన నీరవ్ మోదీ
  • అధికారులకు భారీ ఎత్తున లంచాలు
  • ఇప్పటివరకూ 14 మంది అరెస్ట్ 
  • తీసుకున్న లంచాలను రికవరీ చేస్తామన్న సీబీఐ

పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు రూ. 12 వేల కోట్లకు పైగా ముంచేసి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, బ్యాంకు అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారని సీబీఐ వెల్లడించింది. ఈ విషయాన్ని కోర్టుకు తెలిపిన సీబీఐ తరఫు న్యాయవాది బ్యాంకులోని ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి బంగారు నాణాల నుంచి వజ్రాభరణాల వరకూ నీరవ్ కానుకలుగా ఇచ్చాడని, వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.

బ్యాంకు తరఫున తప్పుడు ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్)లు తీసుకునేందుకు లంచాలు ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ 14 మందిని అరెస్ట్ చేశామని, వీరందరికీ నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీల నుంచి ఏదో ఒక రూపంలో లంచాలు అందాయని వెల్లడించారు. ముంబై ఫారెక్స్ విభాగంలో మేనేజర్ గా పని చేస్తున్న యశ్వంత్ జోషి అనే వ్యక్తి, నీరవ్ తనకు 60 గ్రాముల బరువున్న రెండు బంగారు నాణాలు, ఓ జత బంగారు, మరో జత వజ్రాల చెవి రింగులను ఇచ్చినట్టు అంగీకరించాడని, వాటిని ఆయన ఇంటి నుంచి రికవరీ చేశామని కోర్టుకు సీబీఐ తెలిపింది. మిగిలిన వారు తీసుకున్న ఆభరణాలు, నాణాలను కూడా రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News