Amit Shah: ‘లెఫ్ట్ నాట్ రైట్’.. లెఫ్ట్ పార్టీలకు దేశంలో చోటులేదు: అమిత్ షా

  • కాంగ్రెస్ కునారిల్లుతోందన్న విషయం అర్థమైంది
  • మోదీపై ఈశాన్య ప్రజలకు అచంచల విశ్వాసం
  • త్రిపురలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది
  • త్రిపురలో విజయం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్యలు

లెఫ్ట్ పార్టీలు ఈ దేశంలోని ఏ ప్రాంతానికి సరిపోవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. త్రిపుర ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ ‘లెఫ్ట్ నాట్ రైట్’ అని వ్యాఖ్యానించారు. దేశంలోని ఏ ప్రాంతానికీ అవి సరిపోవన్నారు. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రధాని మోదీ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’నే కారణమన్నారు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి దోహదపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. తమకు విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ నాయకత్వంపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అచంచల విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ రోజురోజుకు కునారిల్లుతోందని, తాజా ఎన్నికల్లో అది నిరూపితమైందని అన్నారు. త్రిపురలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. త్రిపుర, నాగాలాండ్‌లో చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. ‘దేశంలోని ఏ ప్రాంతంలోనూ లెఫ్ట్‌కు చోటు లేదన్న విషయం ఈ ఎన్నికలతో తేలిపోయిందన్నారు.

More Telugu News