Manik Sarkar: ఆహారపు అలవాట్లు మార్చుకుని.. స్థానిక భాష నేర్చుకుని బీజేపీకి విజయాన్ని కట్టబెట్టిన సునీల్!

  • త్రిపురలో బీజేపీ గెలుపు కోసం వేషభాషలు మార్చుకున్న సునీల్
  • నెలలో 15 రోజులు రాష్ట్రంలోనే మకాం
  • స్థానిక భాష నేర్చుకోవడం ద్వారా 20 ఎస్టీ స్థానాల్లోనూ బీజేపీకి విజయాన్ని అందించిన సునీల్

త్రిపురలో పాతుకుపోయిన ఎర్రకోటను కూల్చడంలో సునీల్ దేవధర్ పాత్ర ఎంతో ఉంది. మహారాష్ట్రకు చెందిన ఆయన ప్రచారక్‌గా త్రిపురలో అడుగుపెట్టి ఆహారపు అలవాట్లు మార్చుకుని, స్థానిక భాష నేర్చుకుని ప్రజల్లోకి వెళ్లి మాణిక్ సర్కారు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు.

2005లో ఆరెస్సెస్ ప్రచారక్‌గా ‘హోం ఇండియా’ అనే ఎన్జీవో ద్వారా త్రిపురలో సునీల్ అడుగుపెట్టారు. వలస పిల్లలకు పునరావాసం ఏర్పాటు చేయడం కోసం పనిచేశారు. కేంద్రమంత్రులు, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలను పలుమార్లు రాష్ట్రానికి రప్పించారు.

2014 లో మోదీ వారణాసి నుంచి బరిలోకి దిగినప్పుడు అమిత్ షా త్రిపుర బాధ్యతలను సునీల్‌కు అప్పగించారు. ప్రచారక్‌గా మేఘాలయలో 8 ఏళ్లు పనిచేసిన ఆయన త్రిపుర చేరుకున్నారు. గత ఎన్నికల్లో 50 మంది బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే కేవలం ఒక్కరికి మాత్రమే డిపాజిట్ దక్కింది. దీంతో ఇక్కడ బీజేపీని అధికారంలోకి తేవడం కత్తిమీద సామేనని భావించిన ఆయన వేషభాషల నుంచి ఆహారపు అలవాట్ల వరకు అన్నింటినీ మార్చుకున్నారు.

నెలలో 15 రోజులు రాష్ట్రంలోనే గడిపేవారు. స్థానిక కోక్‌బోరోక్ భాషను నేర్చుకున్నారు. రాష్ట్ర జనాభాలోని 31 శాతం మంది మాట్లాడే ఈ భాషను నేర్చుకోవడం ద్వారా వారితో త్వరగా కలిసిపోయారు. ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం 20 ఎస్టీ రిజర్వు స్థానాలను బీజేపీ సొంతం చేసుకోవడంలో ఆయన పాత్ర అమోఘమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అక్కడి మహిళలకు రక్షణ కల్పిస్తామని, శాంతిభద్రతలను అదుపులోకి తెస్తామని హామీ ఇచ్చి స్థానికుల్లో విశ్వాసం పెంచడంలో సునీల్ విజయం సాధించారు.

More Telugu News