jagan mohan reddy: ఓ నిర్ణయానికి వచ్చేసిన వైసీపీ.. ఈనెల 21న కేంద్రంపై అవిశ్వాసం?

  • నేడు పార్టీ ముఖ్యులు, ఎంపీలతో జగన్ సమావేశం
  • అవిశ్వాసంపై నిర్ణయం
  • అవిశ్వాసంతో బీజేపీకి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు?

కేంద్ర సర్కారుపై అవిశ్వాసం గురించి ఇటీవల మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న ఆయన నేడు పార్టీ ముఖ్యులు, ఎంపీలతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అయితే, ఈ అవిశ్వాసం వల్ల బీజేపీతో తమకు ఏ రకంగానూ ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవాలని భావిస్తున్నట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది.

 వైసీపీకి ప్రస్తుతం ఐదుగురు ఎంపీలే ఉండడంతో అవిశ్వాసానికి అవసరమైన 50 మంది ఎంపీల మద్దతును కూడగట్టి ఈ నెల 21న అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని వైసీపీ భావిస్తోంది. 50 మంది ఎంపీల మద్దతు ఉంటేనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరిస్తారు. అయితే సభ పని దినాల్లో అది ఎప్పుడైనా జరగవచ్చు. ప్రస్తుత సమాచారం ప్రకారం 21న వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే సరిగ్గా పదో రోజున అంటే ఏప్రిల్ 6న సభ ముగుస్తుంది. ఇప్పటికే బోలెడన్ని బిల్లులపై చర్చించాల్సి ఉన్న నేపథ్యంలో సమయాభావం వల్ల వైసీపీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరించకపోవచ్చు. సో, అవిశ్వాస తీర్మానం కంచికే అన్నట్టు అవుతుంది. ఆ రకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి బీజేపీతో పోరాడుతున్నామన్న భావనను ప్రజల్లో కల్పించవచ్చు.. మరోవైపు బీజేపీకి ఏ రకంగానూ ఇబ్బంది కలగించకుండా బయటపడిపోవచ్చన్న వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది.

More Telugu News