Donald Trump: మీ వల్లే ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకొచ్చాం!: మరోసారి భారత్, చైనాలపై ట్రంప్ విసుర్లు

  • ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకునేందుకు ఆ రెండు దేశాలే కారణం
  • అమెరికా ప్రయోజనాలకు ఒప్పందం నష్టదాయకం
  • ఒప్పందం వల్ల 1990ల్లోకి రష్యా..!

పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన 'ప్యారిస్ ఒప్పందం' నుంచి తాము వైదొలగడానికి భారత్, చైనా దేశాలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. ఆ ఒప్పందం ద్వారా భారత్, చైనా లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు అమెరికా అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తుందని, అది తమ దేశ ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన పునరుద్ఘాటించారు. ప్యారిస్ ఒప్పందం నుంచి తాము వైదొలుగుతున్నట్లు గతేడాది జూన్‌లో ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం వల్ల అమెరికా ట్రిలియన్ల కొలదీ డాలర్లను నష్టపోతుంది. ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఇంధన, గ్యాస్, బొగ్గు, తయారీ రంగాలు కుంటుబడుతాయని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండటానికి రెండు మూడు దేశాలు మినహా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు అంగీకరించాయి. "ప్యారిస్ ఒప్పందం నుంచి మేము తప్పుకున్నాం. ఇదో వైఫల్య ఒప్పందం. ఇది మా దేశ ప్రయోజనాలకు చేటు" అని కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ట్రంప్ అన్నారు. ఈ ఒప్పందం రష్యాని 1990ల్లోకి నెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశంలో పుష్కలంగా ఉన్న ఇంధన, గ్యాస్, బొగ్గు వనరులను వినియోగించుకోకుండా ఈ ఒప్పందం అడ్డుకుంటుందని, ఇది అమెరికన్ల ప్రయోజనాలను నీరుగారుస్తుందని, అందుకే దీనిని నిర్మొహమాటంగా తిరస్కరించానని ఆయన తేల్చిచెప్పారు.

More Telugu News