pnb: మీ చర్యలతో బకాయిల వసూళ్లకు అన్ని మార్గాలను మూసేసుకున్నారు... పీఎన్ బీకి నీరవ్ మోదీ లేఖ

  • బ్యాంకు చర్యలు సరిగా లేవన్న నీరవ్
  • మా బ్రాండ్, వ్యాపారం దెబ్బతింది 
  • మేం చెల్లించాల్సినది రూ.5,000 కోట్లలోపే -నీరవ్ 

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,400 కోట్ల మేర మోసం చేసిన ప్రముఖ వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ ఈ విషయంలో బ్యాంకు చేపట్టిన చర్యల్ని తప్పుబట్టారు. దీని ద్వారా బకాయిల వసూలుకు ఉన్న అవకాశాలను మూసేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నీరవ్ మోదీ పీఎన్ బీ యాజమాన్యానికి ఓ లేఖ రాశారు. తన కంపెనీలు బ్యాంకులకు చెల్లించాల్సినది కేవలం రూ.5,000 కోట్ల లోపే ఉంటుందన్నారు.

"బకాయిల విషయంలో తప్పుగా ఆపాదించడం, మీడియాలో ఆ కథనాలు ప్రసారం కావడం, సోదాలు, స్వాధీనాలతో ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ మూతపడేందుకు దారితీశాయి. మా గ్రూపు బకాయిల చెల్లింపు సామర్థ్యాలను ఇది దెబ్బతీసింది. బకాయిలను వెంటనే వసూలు చేసుకోవాలన్న తొందరపాటు చర్యలు మా బ్రాండ్, వ్యాపారాన్ని దెబ్బతీశాయి’’ అని లేఖలో నీరవ్ మోదీ పేర్కొన్నారు. రూ.11,400 కోట్ల మేర నీరవ్ మోదీ ఆయన కంపెనీలు ఎల్ఓయూల ఆధారంగా రుణాలుగా పొంది చెల్లించలేదని పీఎన్ బీ వెల్లడించిన విషయం విదితమే.

More Telugu News