PNB: నీరవ్ మోదీ బ్యాంకు ‘దోపిడీ’లో ఈ ముగ్గురిదే కీలక పాత్ర!

  • ముంబై బ్రాంచ్‌లోని ముగ్గురు అధికారుల హస్తం
  • అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • బ్రాడీహౌస్ బ్రాంచిలో కొనసాగుతున్న సోదాలు

పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోదీ నిండా ముంచేయడం వెనక ముగ్గురు బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్టు సీబీఐ అధికారుల విచారణలో వెల్లడైంది. ముంబైలోని బ్రాడీహౌస్ పీఎన్‌బీ బ్రాంచిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు కుంభకోణానికి సంబంధించి కీలకమైన ఆధారాలను సంపాదించినట్టు సమాచారం. అలాగే ఈ మొత్తం దోపిడీకి సహకరించిన ముగ్గురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

మార్చి, 2010 నుంచి బ్రాడీహౌస్ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న గోకుల్‌నాథ్ శెట్టికి ఈ కుంభకోణంలో పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. గతేడాది మేలో రిటైరైన ఆయన ఉద్యోగ విరమణకు మూడు నెలల ముందు జనవరి 2018 వరకు చెల్లుబాటు అయ్యేలా మూడు ‘లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ)లు జారీ చేశారు. వీటి ద్వారా విదేశాల్లోని నీరవ్ మోదీ సంస్థలకు డబ్బులు చెల్లించేలా తప్పుడు ఆదేశాలు జారీ చేసి బ్యాంకింగ్ వ్యవస్థను తప్పుదారి పట్టించినట్టు సీబీఐ గుర్తించింది.

నీరవ్ మోదీ కేసులో అతడికి సహకరించిన రెండో వ్యక్తి మనోజ్ కరత్. మూడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన కరత్ బ్రాడీహౌస్ బ్రాంచిలోని సింగిల్ విండోలో గుమస్తా. గోకుల్‌నాథ్‌కు కుడిభుజంలా ఉంటూ ఆయన అక్రమాల్లో భాగం పంచుకున్నాడు. కరత్ బీఈ చేసి బ్యాంకులో గుమస్తాగా చేరడం గమనార్హం. ఇక, మూడో వ్యక్తి హేమంత్ భట్. పై ఇద్దరితో పోలిస్తే ఇతడి పాత్ర ఎక్కువ. నీరవ్ మోదీకి చెందిన 16 కంపెనీల్లో హేమంత్ డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసి సీబీఐ అధికారులే విస్తుపోయారు. ఆయా కంపెనీల అధీకృత ఖాతాలన్నింటికీ అధికారికంగా సంతకం చేసే హక్కును కలిగి ఉన్న హేమంత్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. గోకుల్‌నాథ్ శెట్టి, ఇతర అధికారులు.. నీరవ్ మోదీకి మధ్య సంధానకర్తగా వ్యవహరించాడు.

More Telugu News