PNB: బ్యాంకులను 11 వేల కోట్లకు ముంచిన నీరవ్ మోదీ ఇప్పుడెక్కడున్నాడో కనిపెట్టేశారు!

  • ప్రస్తుతం న్యూయార్క్ లో నీరవ్ కుటుంబం
  • మన్ హట్టన్ లోని లగ్జరీ సూట్ లో నివాసం
  • అక్కడికి దగ్గర్లోనే ఆయన నగల దుకాణం
  • ఆయన్ను కలిసి వెళుతున్న చాలామంది

ఇండియాలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా, మరెన్నో బ్యాంకులను రూ. 11 వేల కోట్లకు పైగా మోసం చేసి విదేశాలకు చెక్కేసిన సెలబ్రిటీ జ్యూయెలర్ నీరవ్ మోదీ ఇప్పుడు ఎక్కడున్నాడో కనిపెట్టేశారు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్, మన్ హట్టన్ లోని జేడబ్ల్యూ మారియట్ ఎస్సెక్స్ హౌస్ లో ఉన్న ఓ సూట్ లో తన ఫ్యామిలీతో కలసి ఉంటున్నారు.

 అతను ఉంటున్న లగ్జరీ సూట్ కు నడిచి వెళ్లేంత దూరంలోనే ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న లూక్స్ మాడిసన్ అవెన్యూ జ్యూయెలరీ రిటైల్ స్టోర్ ఉండటం గమనార్హం. కాగా, భారత ప్రభుత్వం శుక్రవారం నాడు నీరవ్ మోదీ పాస్ పోర్టును సీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ తో పాటు ఆయన భార్య, కుటుంబీకులు, వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలు నిందితులుగా ఉండగా, వారెవరూ ఇప్పుడు ఇండియాలో లేకపోవడం గమనార్హం. జనవరి 1న ఇండియాను వదిలిపోయిన ఆయన, చివరిగా జనవరి 23న దావోస్ లో జరిగిన  వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఓ ఫోటో దిగారు.నీరవ్ కుటుంబం తలదాచుకున్న ఎస్సెక్స్ హౌస్ (ఫోటో మారియట్ డాట్ కామ్ నుంచి)
కాగా, ప్రస్తుతం నీరవ్ ఉంటున్న లగ్జరీ సూట్ నుంచి న్యూయార్క్ సెంట్రల్ పార్కు కనిపిస్తుందని, అది 36వ అంతస్తులో ఉందని సమాచారం. ఇక కొన్ని మీడియా సంస్థలు ఆయన్ను కలిసేందుకు గురువారం నాడు ప్రయత్నించగా, నీరవ్ ఆయన భార్య బయటకు వెళ్లారని, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారని అక్కడి ఉద్యోగులు వెల్లడించారని తెలుస్తోంది.

బుధవారం రాత్రి ఆ సూట్ కు చాలా మంది వచ్చారని, నీరవ్ కుంభకోణం బయట పడ్డప్పటి నుంచీ అక్కడ చర్చలు సాగుతున్నాయని సమాచారం. రోజులో చాలాసార్లు నీరవ్ భార్య అమీ మోదీ బయటకూ, లోపలకూ తిరుగుతున్నట్టు కూడా మీడియా సంస్థలు గుర్తించాయి.

More Telugu News