PNB: నీరవ్ మోదీ ప్రకంపనలు... పీఎన్బీ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్...!

  • తొలుత రూ. 280 కోట్ల మోసం జరిగినట్టు ప్రకటన
  • ఆపై అది రూ. 11,300 కోట్లకు పెరిగిన వైనం
  • ఈ వ్యవహారంలో దాదాపు 30 బ్యాంకులు ఇరుక్కున్న వైనం  
  • వారిని రప్పించడం సులభం కాదంటున్న నిపుణులు

పది రోజుల క్రితం తమ బ్యాంకులో రూ. 280 కోట్ల మేరకు మోసం జరిగిందని దేశంలో ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలన ప్రకటన చేసింది. రూ. 280 కోట్ల మోసం కాస్తా ఇప్పుడు రూ. 11,300 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం మరింతగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుండగా, ఇప్పుడు మరో వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు మరో 30 వరకూ బ్యాంకులు కూడా ఇరుక్కున్నట్టు భావిస్తున్నారు. యూనియన్‌ బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు సహా పలు విదేశీ, స్వదేశీ బ్యాంకులకూ వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

ఇక ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు రహస్యంగా నీరవ్ మోదీకి దోచిపెట్టినట్టుగా ఈ వ్యవహారం కనిపించడం లేదని కుంభకోణాన్ని విచారించేందుకు రంగంలోకి దిగిన అధికారులు భావిస్తున్నారు. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ విశ్వసనీయత ఏంటో తెలుసుకోకుండా పలు బ్యాంకులు రుణాలను మంజూరు చేయడంపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. నీరవ్ మోదీ వ్యవహారం 2010 నుంచి సాగుతోందని, 2015లో నరేంద్ర మోదీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కుంభకోణం గురించి తొలిసారిగా వెల్లడించిన వ్యక్తి ఆరోపిస్తున్నాడు.

ఇక ఇప్పటికే విదేశాలకు పారిపోయిన నీరవ్ ను అంత సులభంగా ఇండియాకు రప్పించలేమని విజయ్ మాల్యా, లలిత్ మోదీ వ్యవహారాలను చూసిన వారు అంటున్నారు. నీరవ్ భారత పౌరుడే అయినప్పటికీ, ఆయన భార్య అమీకి అమెరికా పౌరసత్వం, సోదరుడు నిషాల్ కు బెల్జియం పౌరసత్వం ఉన్నాయి. వీరిని ఇండియాకు రప్పించడం అంత సులభమేమీ కాదని అంచనా. కష్టపడి సంపాదించుకున్న డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటుంటే, వాటినిలా మోసగాళ్లకు ధారాదత్తం చేయడం ఏంటని ప్రజలు బ్యాంకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News