America: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ట్రంప్.. వేతనాన్ని విరాళాలుగా ఇచ్చేస్తున్న అధ్యక్షుడు

  • వేతనం తీసుకోకుండా పనిచేస్తానని గతంలో వెల్లడించిన ట్రంప్
  • నిబంధనల ప్రకారం వేతనం తీసుకోవాల్సిందే
  • జీతాన్ని విరాళంగా ఇచ్చేస్తున్న అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నాలుగో త్రైమాసిక వేతనం మొత్తాన్ని అమెరికా రవాణా విభాగానికి విరాళంగా అందజేశారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం ట్రంప్ తన లక్ష డాలర్ల వేతన చెక్‌ను రవాణా విభాగం కార్యదర్శి ఎలైన్‌ చావోకు చెక్‌ రూపంలో పంపించారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ పంపిన సొమ్ము మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

ట్రంప్ గతంలోనూ తన జీతాన్ని వివిధ  సంస్థలకు విరాళంగా అందించారు. తాను వేతనం తీసుకోకుండా పనిచేస్తానని గతంలోనే ప్రకటించిన ట్రంప్ గతంలో తన వేతనాన్ని ఆరోగ్యం, మానవ సేవలు, జాతీయ పార్క్ సేవలు, విద్యారంగాలకు విరాళంగా ప్రకటించారు. ట్రంప్ తాను జీతం తీసుకోనని ప్రకటించినప్పటికీ నిబంధనల ప్రకారం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడాదికి 4 లక్షల డాలర్ల వేతనం అందుకుంటున్న అధ్యక్షుడు ట్రంప్ దానిని ఇలా విరాళంగా ఇచ్చేస్తున్నారు.

More Telugu News