jet airways: కాక్ పిట్ లో పైలెట్ల ఫైట్... చర్యలు తీసుకున్న డీజీసీఏ!

  • ఈనెల 1న లండన్ నుంచి ముంబై బయల్దేరిన విమానంలో వివాదం
  • కొట్టుకున్న సీనియర్ పైలెట్, మహిళా కో పైలెట్ 
  • ఏడుస్తూ క్యాబిన్ బయటకు వెళ్లిన మహిళా కో పైలెట్  

జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో పైలెట్ల మధ్య వివాదం ముదిరి చెంపదెబ్బలు కొట్టుకునేంతవరకు వెళ్లిన వివాదంపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఈనెల ఒకటో తేదీన లండన్‌ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి 324 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ కు బయల్దేరిన జెట్‌ ఎయిర్‌ వేస్‌ విమానం గాల్లో ఉండగా, సీనియర్ పైలెట్.. మహిళా కో పైలెట్ మధ్య వివాదం రేగి ఒకరిని ఒకరు కొట్టుకున్నారు.

 దీంతో ఆమె ఏడుస్తూ కేబిన్ నుంచి బయటకు వచ్చేసింది. అనంతరం ప్రయాణికుల రక్షణను గాలికి వదిలేసి పైలెట్ కూడా బయటకు వచ్చేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అనంతరం కేబిన్ క్రూ జోక్యంతో వివాదం ముగిసింది. విమానం క్షేమంగా ముంబైలో ల్యాండ్ అయింది. అనంతరం దీనిపై విచారణ చేపట్టిన డీజీసీఏ గొడవ పడిన ఇద్దరు పైలెట్లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించింది. తాజాగా వారిద్దరి లైసెన్సును ఐదేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు డీజీసీఏ చీఫ్‌ బీఎస్‌ భుల్లార్‌ ప్రకటించారు.

More Telugu News