Matunga: ఈ రైల్వే స్టేషన్ మొత్తం మహిళల అధీనంలోనే!.. లిమ్కాబుక్‌లో 'మటుంగా స్టేషన్'!

  • స్టేషన్‌లో ఉద్యోగులందరూ మహిళలే
  • ఫలించిన జనరల్ మేనేజర్ డీకే శర్మ కృషి
  • మొత్తం 41 మంది మహిళా ఉద్యోగులతో దేశంలోనే రికార్డు

ముంబైలోని మటుంగా రైల్వే స్టేషన్ రికార్డులకెక్కింది. దేశం మొత్తం మీద పూర్తిగా మహిళలతో నిర్వహిస్తున్న తొలి రైల్వే స్టేషన్‌గా ఘనత సాధించింది. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్న ఈ రైల్వే స్టేషన్‌లో అన్ని విభాగాల్లోనూ మహిళలే పనిచేస్తుండడం విశేషం. మొత్తం 41 మంది మహిళా ఉద్యోగులతో లిమ్కాబుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

మటుంగా రైల్వే స్టేషన్ ఈ ఘనత సాధించడం వెనక సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ డీకే శర్మ కృషి ఎంతగానో ఉంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ స్టేషన్‌లో ఉద్యోగులందరూ మహిళలే ఉండేలా చూసుకున్నారు. స్టేషన్ మేనేజర్ నుంచి టికెట్ జీఆర్పీ పోలీసుల వరకు అందరూ మహిళలనే నియమించారు. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో అన్ని విభాగాల్లో కలిపి 41 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. స్టేషన్ మేనేజర్ మమత కులకుర్ణి ఆధ్వర్యంలో వీరంతా పనిచేస్తున్నారు.

ఓ స్టేషన్‌లో ఇంతమంది మహిళలు పనిచేయడం, స్టేషన్ మొత్తం మహిళల అధీనంలో ఉండడం భారతీయ రైల్వేలో ఇదే తొలిసారి. మహిళలను నియమించిన ఆరు నెలల్లోనే లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం ఆనందంగా ఉందని డీకేశర్మ ఆనందం వ్యక్తం చేశారు. మహిళలను వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

More Telugu News