stocks: ఇన్వెస్టర్లకు ఈ పది షేర్లు రూ.15 లక్షల కోట్లు పంచాయి!

  • ఐదేళ్లలో ఎన్నో రెట్ల పెరుగుదల
  • వీటిలో ఇన్వెస్ట్ చేసి కొనసాగిన వారికి భారీ లాభాలు
  • మోతీలాల్ ఓస్వాల్ అధ్యయన నివేదిక

దేశీయ స్టాక్ మార్కెట్ల బుల్ ర్యాలీతో ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురుస్తోంది. అందరికీ కాదులేండి... మంచి షేర్లను గుర్తించి ఇన్వెస్ట్ చేసిన వారికే. అందుకు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న షేర్లే నిలువెత్తు నిదర్శనం. ప్రముఖ బ్రోకరేజీ, ఆర్థిక సేవల కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అధ్యయనం నిర్వహించి ఓ నివేదిక విడుదల చేసింది.

పది బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ 2012 నుంచి 2017 మధ్య కాలంలో రూ.15 లక్షల కోట్లకు పైగా పెరిగింది. వీటిలో టీసీఎస్ అగ్ర స్థానంలో ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క ఈ కంపెనీ మార్కెట్ విలువనే రూ.2.5 లక్షల కోట్లు వృద్ధి చెందింది. హెచ్డీఎఫ్ సీ బ్యాంకు మార్కెట్ విలువ రూ.2.3 లక్షల కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1.9 లక్షల కోట్లు, ఇండియన్ ఆయిల్ రూ.1.2 లక్షల కోట్ల మేర మార్కెట్ విలువను అదనంగా పెంచుకోగలిగాయి.

ఈ కాలంలో సంపద సృష్టిలో ఎక్స్ ప్రెస్ వేగం చూపించిన షేరు అజంతా ఫార్మా. దీని మార్కెట్ విలువ 2012లో కేవలం రూ.500 కోట్లు. కానీ నేడు రూ.15,500 కోట్ల స్థాయికి పెరిగింది. బాస్మతీ బియ్యం ఎగుమతి సంస్థ కేఆర్ బీఎల్ మార్కెట్ విలువ 23 రెట్లు పెరిగి రూ.9,700 కోట్లకు చేరగా, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ 15 రెట్ల వృద్ధితో రూ.64,600 కోట్లకు, దాల్మియా భారత్ మార్కెట్ విలువ 14 రెట్ల పెరుగుదలతో రూ.17,500 కోట్లకు, సింఫనీ మార్కెట్ విలువ 13 రెట్ల వృద్ధితో రూ.10,700 కోట్లకు చేరింది.

More Telugu News