KCR: 5 వేల కొత్త పంచాయతీలు, 20 కొత్త మున్సిపాలిటీలు: కేసీఆర్

  • జిల్లాల పునర్వ్యవస్థీకరణ గొప్ప సంస్కరణ
  • కొత్త జిల్లాలవారీగానే నిధులు వస్తున్నాయి
  • పాలనా సంస్కరణలపై చర్చ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం

అధికార వికేంద్రీకరణ వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ గొప్ప సంస్కరణ అని చెప్పారు. దీని వల్ల ఎన్నో లాభాలు జరిగాయని అన్నారు. దేశంలో పశ్చిమబెంగాల్, ఏపీ మినహాయించి అన్ని రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన జరిగిందని చెప్పారు. తెలంగాణ కూడా ఇదే బాటలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుందని అన్నారు. దీని వల్ల పరిపాలనా సౌలభ్యం జరిగిందని చెప్పారు.

జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రాలకు చెందినదని... కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. అయినప్పటికీ ప్రధాని కార్యాలయం, ఆర్బీఐ, సుప్రీంకోర్టులు 31 జిల్లాలను నోటిఫై చేశాయని తెలిపారు. కొత్త జిల్లాలవారీగానే నిధులు వస్తున్నాయని చెప్పారు. కొత్త జిల్లాల కలెక్టర్ల ద్వారా 50 శాతం భూరికార్డులు ప్రక్షాళన అయ్యాయని తెలిపారు. పాలనా సంస్కరణలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగిన సందర్భంగా కేసీఆర్ ఈ విషయాలను తెలిపారు.

తెలంగాణలో 468 డివిజన్లు, 584 మండలాలు, 9 పోలీస్ కమిషనరేట్లు, 814 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. జోన్లను తెలంగాణకు అనుకూలంగా మార్చుకుందామని తెలిపారు. త్వరలోనే 5 వేల కొత్త పంచాయతీలు, 15 నుంచి 20 వరకు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

More Telugu News