ivanka trump: హైదరాబాద్ లో భిక్షాటన నిషేధం.. దొరికితే జైలు శిక్ష... రెండు నెలలు మాత్రమే... ఆ తరువాత షరా మామూలేనట!

  • అతిథుల ముందు గౌరవం తగ్గరాదని భావిస్తున్న ప్రభుత్వాలు
  • వచ్చే రెండు నెలలూ యాచకులపై నిషేధం
  • పలు అంతర్జాతీయ సదస్సులు జరగనుండటమే కారణం
  • 28 నుంచి ఇన్వెస్ట్ మెంట్ సదస్సు.. హాజరు కానున్న ఇవాంకా ట్రంప్

బయటి దేశాల నుంచి వచ్చే అతిథుల ముందు గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, నిలువ నీడలేక, రోడ్లపై నిద్రిస్తూ, జీవనోపాధికి, నలుగురి వద్దా అడుక్కుంటున్న వారిపై జులుం చూపేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు, వరల్డ్ టూరిజం సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలు... ఇలా పలు అంతర్జాతీయ సదస్సులు జరగనున్న నేపథ్యంలో, అతిథుల కళ్ల ముందు బిచ్చగాళ్లు కనిపించరాదని, వారికి యాచకులతో ఎటువంటి సమస్య ఉండకూడదని భావిస్తూ, నేటి నుంచి రెండు నెలల పాటు యాచించడాన్ని నిషేధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

బిచ్చమెత్తితే నెల రోజుల జైలుశిక్షను అనుభవించాల్సి వుంటుందని, రూ. 200 జరిమానా విధిస్తామని, ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. జనవరి 7వ తేదీ వరకూ ఈ ఆజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. కాగా, ఈ నెల 28 నుంచి ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా రానుండటం, ప్రధాని హాజరై సదస్సును ప్రారంభించనుండటంతో పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు సాగుతున్నాయి.

More Telugu News