revant reddy: ఇంకా అమరావతిలోనే ఉన్న రేవంత్ రాజీనామా లేఖ!

  • నాలుగు రోజులైనా హైదరాబాద్ చేరని రేవంత్ రాజీనామా
  • స్పీకర్ కార్యాలయానికి పంపని చంద్రబాబు పేషీ
  • రేపు నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు

కొడంగల్ ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నాలుగు రోజుల నాడు రేవంత్ రెడ్డి ఇచ్చిన రాజీనామా లేఖ ఇంకా అమరావతిలోనే ఉండిపోయింది. గత వారంలో చంద్రబాబు పిలుపు మేరకు అమరావతి వెళ్లిన రేవంత్ రెడ్డి, అక్కడ ఆయన కార్యదర్శికి రాజీనామా లేఖను అందించి, దాన్ని చంద్రబాబుకు ఇవ్వాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

ఇక, రాజీనామా లేఖను హైదరాబాద్ లోని అసెంబ్లీ స్పీకర్ కు నేరుగా ఇవ్వకుండా, చంద్రబాబుకు ఇవ్వడం వెనుక రేవంత్ వ్యూహం కూడా ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆది నుంచి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ వచ్చిన రేవంత్, రాజీనామా చేసిన తరువాతే పార్టీ మారి, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచారు. ఆ ప్రభావం చంద్రబాబుపైనా ఉంటుందని భావన.

కాగా, స్పీకర్ ఫార్మాట్ లోనే ఉన్నప్పటికీ, రేవంత్ రాజీనామా ఇంకా తెలంగాణ స్పీకర్ కు అందలేదు. నవంబర్ 2 వరకూ తన వద్దే రేవంత్ రాజీనామాను ఉంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం హైదరాబాద్ కు వచ్చి తెలుగుదేశం నేతలతో సమావేశమై, రేవంత్ విషయమై ఓ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

తెలంగాణకు చెందిన టీడీపీ నాయకుల చేతికి ఆ లేఖను ఇచ్చి స్పీకర్ కార్యాలయంలో అందించాలని చంద్రబాబు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఆ లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపకుంటే, రేవంత్ మరో లేఖను స్పీకర్ ను కలిసి ఇస్తారా? లేదా? అన్నది తెలియాల్సి వుంది.

More Telugu News