revant reddy: పోయిన వారు పోగా... మిగిలిన టీడీపీ వారి చూపు టీఆర్ఎస్ వైపు!

  • 2014 ఎన్నికల్లో 15 సీట్లు
  • ఇప్పుడు మిగిలింది ఇద్దరే
  • రేవంత్ వెంట సుమారు 100 మందికి పైగా నేతలు జంప్
  • టీఆర్ఎస్ వైపు చూస్తున్న మరికొందరు

2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత, తెలంగాణలో తెలుగుదేశం ఎమ్మెల్యేల సంఖ్య 15గా ఉండగా, ఇప్పుడా సంఖ్య 2కు పడిపోయింది. ఆ ఇద్దరిలోనూ ఒకరు క్రియాశీలకంగా లేరు. టీడీపీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయనే రాగ్య కృష్ణయ్య. ఇక తాజాగా టీడీపీ కీలక నేత, అసెంబ్లీలో ఇంతకాలమూ పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటు దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలను, ఏడెనిమిది మంది మాజీ మంత్రులు, ఓ పది మంది జిల్లా పార్టీ అధ్యక్షులను, అంతకుమించి జడ్పీటీసీలు, 100కు పైగా పార్టీలో వివిధ పదవులను అనుభవిస్తున్న వారిని తీసుకెళుతున్నారు. ఇది ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి మింగుడుపడని విషయమే.
 
మరో ఏడాదిన్నర వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ లేదా ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో ఉంటే మేలు కలుగుతుందే తప్ప, టీడీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తే నాశనం అవుతుందని టీడీపీలోని అత్యధికులు భావిస్తున్నందునే రాజీనామాల సంఖ్య అధికంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడం, చంద్రబాబు నుంచి పొత్తుపై సంకేతాలు రాకపోవడంతో నేతల్లో స్పష్టత కొరవడి, ఆలస్యమైతే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనలోకి వెళ్లిపోయారు.

అయితే, టీడీపీ వద్దనుకున్న వారంతా తొలుత సంప్రదించింది టీఆర్ఎస్ నేనని తెలుస్తోంది. అయితే, ఓ కార్యకర్తగా వస్తే ఆహ్వానిస్తాంగానీ, షరతులు పెడుతూ, టికెట్లు కావాలని కోరుతూ వస్తే మాత్రం ఎవరూ అక్కర్లేదని టీఆర్ఎస్ స్పష్టం చేయడంతో తెలుగు తమ్ముళ్లకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపించింది. కొందరికి మాత్రం టీఆర్ఎస్ ఆహ్వానం పలికినట్టు సమాచారం. అందువల్లే తమ అనుయాయులకు విషయం చెప్పి, వారిని ఒప్పించి కాంగ్రెస్ లో చేరిపోయేందుకు అడుగులేస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో తమకు తలుపులు తెరచిపెట్టే ఉన్నాయని భావిస్తున్న కొందరు మాత్రం ఇంకా టీడీపీలో ఉన్నారని తెలుస్తోంది. వీరు సమయం వస్తే ఫిరాయిస్తారని, కొందరు బీజేపీవైపూ చూస్తున్నారని సమాచారం.

More Telugu News