madras high court: రోడ్ల మీద‌, కూడ‌ళ్ల‌లో బ్యాన‌ర్లు, ఫ్లెక్సీలు క‌ట్ట‌డంపై నిషేధం విధించిన మ‌ద్రాస్ హైకోర్టు

  • జీవించి ఉన్న వారి ఫొటోలు వేయొద్ద‌ని ఆదేశం
  • గోడ‌ల మీద అన‌వ‌స‌ర రాత‌ల‌పై కూడా నిషేధం
  • ప్రైవేట్ పిటిష‌న్‌కి స్పందించిన కోర్టు
  • ఉల్లంఘిస్తే ప్లెక్సీలో ఉన్న వారిపై కేసు

జ‌నావాస ప్రాంతాల్లో, కూడ‌ళ్ల వ‌ద్ద క‌ట్టే ప్లెక్సీలు, పోస్ట‌ర్ల మీద జీవించి ఉన్న నాయ‌కులు, వ్య‌క్తుల ఫొటోలు వేయ‌డంపై మ‌ద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. జీవించి ఉన్న వారి ఫొటోల‌ను ఫ్లెక్సీలు, పోస్ట‌ర్లు, గుర్తింపు బోర్డుల మీద లేకుండా చూసుకోవాల్సిందిగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీని వ‌ల్ల రాజ‌కీయ నాయ‌కులు, నేత‌లు, మంత్రులు, కార్య‌క‌ర్త‌ల ఫొటోల‌ను ఫ్లెక్సీల మీద ముద్రించే అవ‌కాశం లేకుండా పోయింది. ఎన్నిక‌ల ప్ర‌చారాలు, ఇత‌ర రాజ‌కీయ కార్య‌క్ర‌మాల స‌మ‌యంలో నేత‌ల మ‌ద్ద‌తుదారులంద‌రూ చెన్నై వీధుల‌న్నింటినీ త‌మ ప్రియ‌త‌మ నేత‌ల పోస్ట‌ర్లు, ఫ్లెక్సీల‌తో నింపేస్తుంటారు.

అలాగే గోడ‌ల మీద అన‌వ‌స‌ర‌ రాత‌లు లేకుండా చేసి రాష్ట్రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని హైకోర్టు ఆదేశించింది. త్వ‌ర‌లో తిరుచిరాప‌ల్లిలో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి చేప‌ట్ట‌ద‌ల‌చిన ఎంజీఆర్ శ‌తాబ్ది వేడుక‌ల మీద ఈ నిషేధం ప్ర‌భావం ప‌డనుంది.  చెన్నైలోని అరుంబాక్కం ప్రాంతంలో నివ‌సించే బి. తిరులోచ‌నా కుమారి అనే మ‌హిళ‌, త‌న ఇంటి ముందు ఉన్న బ్యాన‌ర్ల‌ను తొల‌గించాల‌ని న‌గ‌ర పాల‌క సంస్థ‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని ప్రైవేట్ పిటిష‌న్ ద్వారా కోర్టును ఆశ్ర‌యించింది. త‌న ఇంటి ముందు ఉన్న బ్యాన‌ర్ తొల‌గించాల‌ని అడిగినందుకు ఆ ప్లెక్సీ పెట్టిన‌వాళ్లు త‌న‌ని బెదిరించార‌ని తిరులోచ‌నా కుమారి పిటిష‌న్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన కోర్టు ఎవ‌రైనా నిషేధానికి వ్య‌తిరేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు క‌డితే ప్లెక్సీల్లో ఉన్న వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

More Telugu News