tripura: త్రిపురలో యువ జర్నలిస్టు దారుణ హత్య!

  • విధి నిర్వహణలో ఉన్న విలేకరి కిడ్నాప్
  • ఆపై కొట్టి చంపిన దుండగులు
  • బీజేపీ పనేనన్న సీపీఐ (ఎం)

తన విధి నిర్వహణలో భాగంగా, ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ యువ జర్నలిస్టును కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, దారుణంగా హత్య చేశారు. త్రిపుర రాష్ట్రంలోని పశ్చిమ త్రిపుర జిల్లాలో జరిగిన కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక న్యూస్ చానల్ 'దినారత్'లో పని చేస్తున్న శంతనూ భౌమిక్, మందాయి ప్రాంతంలో జరుగుతున్న రాస్తారోకోను కవర్ చేస్తుండగా, వెనుక నుంచి ఢీకొట్టిన వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారని తెలిపారు.

ఆపై కాసేపటికి భౌమిక్ తీవ్ర గాయాలతో రోడ్డుపక్కన కనిపించగా, వెంటనే అగర్తలా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించామని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారని ఎస్పీ అభిజిత్ సప్తార్షి వెల్లడించారు. జర్నలిస్టు హత్యను త్రిపుర వైద్య మంత్రి బాదల్ చౌదరి ఖండించారు. సమాచార మంత్రి భానూలాల్ సాహా ఆసుపత్రికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. బీజేపీ నేతృత్వంలో పనిచేస్తున్న ఐపీఎఫ్టీ గూండాలే ఈ హత్యకు కారణమని సీపీఐ (ఎం) ఆరోపించగా, ఇది సీపీఐ (ఎం) ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది.

More Telugu News