: నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుపై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు జరిపిన గన్ మెన్

ఉపఎన్నిక ముగిసినా నంద్యాలలో ఉద్రిక్తతలు తగ్గలేదు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఈ రోజు నంద్యాల పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. ఓ మైనార్టీ నేత అంత్యక్రియల సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నంద్యాల వైసీపీ కౌన్సిలర్ చింపింగ్ బాషా చనిపోవడంతో, ఈరోజు అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిల్పా చక్రపాణిరెడ్డి హాజరై తిరిగి వస్తుండగా, టీడీపీ నేత అభిరుచి మధుకు సంబంధించిన వాహనం వారికి అడ్డు వచ్చింది. వాహనాన్ని పక్కకు తీయాలని శిల్పా వర్గానికి చెందినవారు కోరారు. దీనికి ఆయన ససేమిరా అనడంతో... ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది.

ఈ క్రమంలో టీడీపీ నేత అభిరుచి మధుకు చెందిన వాహనంపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. దీంతో, పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడుతున్నవారిని చెదరగొట్టేందుకు అభిరుచి మధు ప్రైవేట్ గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఉద్రిక్త పరిస్థితి గురించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అక్కడున్నవారిని పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు శిల్పా చక్రపాణిరెడ్డిని, అభిరుచి మధును వేర్వేరు మార్గాల్లో అక్కడ నుంచి పోలీసులు పంపించేశారు. గాల్లోకి కాల్పులు జరిపిన మధు గన్ మెన్ ను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News