: కేంద్రానికి భారీ షాక్... వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు... సందిగ్ధంలో ఆధార్ అనుసంధానం!

కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆధార్ కార్డు అనుసంధానం తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. 9 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని కీలక తీర్పును వెలువరించింది. ఆధార్ కార్డుతో అనుసంధానం వ్యక్తిగత గోప్యత హక్కును హరిస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది.

దీంతో పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ లకు ఆధార్ ను అనుసంధానించాలన్న కేంద్రం నిర్ణయానికి తీవ్ర ప్రతిబంధకం ఏర్పడింది. 1957లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించింది. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాసే హక్కు పార్లమెంటుకు లేదని స్పష్టం చేసింది. బ్యాంకు, లేదా పాన్ కార్డు వంటి వాటికి ఆధార్ ను అనుసంధానం చేయడం వల్ల వ్యక్తిగత గోప్యత హక్కు దెబ్బతింటుందని తెలిపింది. అలా అనుసంధానించడం వల్ల వ్యక్తిగత గోప్యత ఉండదని, వారి సమాచారాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆధార్ అనుసంధాన విధానం ప్రైవసీని కాలరాస్తుందని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. 

More Telugu News