: నంద్యాల ఉప ఎన్నికపై వేల కోట్లలో బెట్టింగులు.. టీడీపీ మెజార్టీపైనే ఎక్కువ పందేలు!

నిన్న ముగిసిన నంద్యాల ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. 2019 ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక సెమీఫైనల్ లాంటిదని భావించిన టీడీపీ, వైసీపీలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలంతా నంద్యాలలోనే మకాం వేసి ప్రచారపర్వాన్ని తార స్థాయికి తీసుకెళ్లారు. మద్యం, డబ్బు ఏరులై పారాయి. ఎంతో ఉత్కంఠ మధ్య పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

ఇప్పుడు, ఈ ఉప ఎన్నికలపై బెట్టింగులు జోరందుకున్నాయి. మొన్నటి దాకా కేవలం ఎవరు గెలుస్తారనే దానిపైనే బెట్టింగులు సాగాయి. టీడీపీ అభ్యర్థిపై పందెం కాసేవారికి రూపాయికి రూపాయిని ఆఫర్ చేశారు. వైసీపీ గెలుపుపై పందెం కాసేవారికి రూపాయికి మూడు రూపాయలు ఇచ్చే విధంగా పందేలు కొనసాగాయి. ఇప్పుడు, బెట్టింగ్ రూటు మారింది. మెజార్టీపై బెట్టింగులు ఊపందుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడేసరికి ఈ బెట్టింగ్ లు రూ. 2 వేల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు.

కర్నూలు జిల్లాతో పాటు బళ్లారి, రాయచూర్, కోలార్, బెంగళూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థికి వచ్చే మెజార్టీపైనే ఎక్కువ బెట్టింగులు సాగుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News