: లాలుకు మరో షాక్.. ర్యాలీకి సోనియా, మాయా డుమ్మా!

2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిర్వహించ తలపెట్టిన ‘బీజేపీని తరిమికొట్టు.. దేశాన్ని రక్షించు’ (బీజేపీ భగావో.. దేశ్ బచావో) ర్యాలీకి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకావడం లేదు.

అధినేత్రులు ఇద్దరు ర్యాలీకి హాజరు కాలేకపోతున్నట్టు సమాచారం అందుకున్న లాలు మాట్లాడుతూ.. తాను మాయావతితో మాట్లాడానని, ఆమె తన పార్టీ జనరల్ సెక్రటరీ సతీశ్ చంద్రమిశ్రాను తన బదులు పంపిస్తున్నట్టు చెప్పారని పేర్కొన్నారు. సోనియా తరపున సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్, పార్టీ జనరల్ సెక్రటరీ సీపీ జోషిలను ర్యాలీకి పంపిస్తున్నట్టు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ ర్యాలీకి హాజరవుతున్నట్టు స్పష్టం చేశారు. అలాగే జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, అతని మద్దతుదారులు ర్యాలీకి హాజరువుతున్నట్టు లాలు వివరించారు.

వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి ర్యాలీని వాయిదా వేసుకోవాలన్న ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అభ్యర్థనను లాలు కొట్టిపడేశారు. ఆయన తనకు పాఠాలు చెప్పాల్సిన పనిలేదని, ర్యాలీ వాయిదా వేసుకుంటే వరదలు ఆగిపోతాయా? అని ప్రశ్నించారు. ఆర్జేడీ ర్యాలీకి ముందు రోజు 26న ప్రధాని మోదీ బీహార్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించడం పైనా లాలు మండిపడ్డారు. గత ఏడాది రాష్ట్రంలో వరదలు సంభవించినప్పుడు ఎందుకు పర్యటించలేదని మోదీని నిలదీశారు.

More Telugu News