: తెలుగు సినిమా టైటిల్స్ లో 'కులం' ప్రస్తావనపై గేయ రచయిత సిరాశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన‌ ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైటిల్‌తోనే ఎంతో ప‌బ్లిసిటీ సంపాదించేసింది. ఆ త‌రువాత టీజర్, పోస్ట‌ర్లపై ప‌లువురు అభ్యంత‌రాలు తెల‌ప‌డం, రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా ఆ పోస్ట‌ర్ల‌పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌పై ఫేస్‌బుక్‌లో పోస్టులు చేయ‌డంతో ఈ సినిమాకు ఫ్రీగా ప‌బ్లిసిటీ వ‌చ్చేస్తోంది. ఈ సినిమా టైటిల్ పై సినీ ప్రముఖులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా గేయ ర‌చ‌యిత సిరాశ్రీ ఈ సినిమా టైటిల్‌పై త‌న ఫేస్‌బుక్‌లో ఆస‌క్తిక‌ర పోస్టింగ్ చేశారు.

  ఈ సినిమా టైటిల్‌పై ఆయన చేసిన పోస్టు య‌థాత‌థంగా...

Mahesh Kathi పెట్టిన పోస్ట్- "అర్జున్ రెడ్డి. నరసింహ నాయుడు. పెదరాయుడు. రామన్న చౌదరి అనే సినిమా టైటిల్స్ నాకు సమస్య కాదు. కాకపోతే, కృష్ణ మాదిగ. మాల రాముడు అనే టైటిల్స్ తో త్వరలో సినిమాలు రావాలని మాత్రం కోరుకుంటాను. సింపుల్."
---------------------------------------------------------------------------------

అలా కోరుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. ఆ మధ్య నా బ్రాహ్మణ ఫ్రెండ్ ఒకడు సరదాగా అన్నాడు- "అర్జున్ శర్మ", "నరసింహ శాస్త్రి", "పెద్దపంతులు" అని టైటిల్స్ పెట్టి మాంచి యాక్షన్ సినిమాలు తీయొచ్చు కదా. మనం కూడా కాసేపు హీరోల్లా ఫీలవ్వచ్చు" అని. తర్వాత "సీమశాస్త్రి" వచ్చింది. "ఇలా కామెడీ సినిమా తీసారేంటి" అని నిట్టూర్చాడు!- మళ్లీ సరదాగానే!

నా వైశ్య మిత్రుడు ఒకడు "ఎప్పుడో షావుకారు అనే టైటిల్ తో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినిమా వచ్చింది. తర్వాత సినిమాల్లో మా కులాన్ని పట్టించుకున్నవాడే లేడు" అన్నాడు సరదాగా!

ఇక పాయింట్ కి వస్తే, టైటిల్లో పెట్టకపోయినా, "స్వయంకృషి"లో చిరంజీవి పాత్రది ఏ కులం? ఎంత ఉదాత్తమైన పాత్ర...నిజంగా అందరికీ రోల్ మోడల్ క్యారక్టర్ అది. తెలుగు సినిమా పుట్టిన కొత్తల్లో "మాలపిల్ల" సినిమా వచ్చింది. అదెంత ప్రొగ్రెసివ్ కథ! "రుద్రవీణ" కథలో "మాలపిల్ల" స్ఫూర్తి కూడా కనిపిస్తుంది.

ఇక కమ్మ, రెడ్డి కులాల టైటిల్స్ వెనుక ఉన్న విషయం ఒక్కసారి ఆలోచించాలి. సినీపరిశ్రమ అనే కాదు...రాజకీయాలు, ప్రైవేట్ విద్యారంగం, వ్యాపారరంగం ఇలా పలు రంగాల్లో ఆ రెండు కులాల వాళ్లు దూసుకెళ్లిపోయారు. మిగిలిన కులాలవాళ్లల్లో అధికశాతం మంది వాళ్ల స్టూడియోల్లోనో, కంపెనీల్లోనో, వాళ్ల కాలేజీల్లోనో, సంస్థల్లోనో ఉద్యోగాలు చేస్తున్నారు. అందరికీ ఉంటుందనలేను కానీ పెట్టే స్థాయిలో ఉన్నవాడికి పుచ్చుకునే స్థాయిలో ఉన్నవాడికంటే కాస్త దర్పం ఎక్కువే ఉంటుంది. అది సహజం. ఆ దర్పం నిజంగా పెట్టేవాడికి లేకపోయినా ఆ కులంలో పుట్టి ఖాళీగా కూర్చున్నవాడికైనా క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా వచ్చే అవకాశం ఉంది.

 ఆ ఫీలింగ్ మిగిలిన కులాల ఆత్మగౌరవాన్ని మాటలచేతో, చేతల చేతో కించపరచనంత వరకూ అంగీకారమే అవుతుంది. ఆ కారణంగానే టైటిల్స్ లో రెడ్డి, చౌదరి అని ఉన్నా మెజారిటీ జనానికి అది యాక్సెప్టుబుల్ అయ్యింది. ఇది నేను కాన్షియస్ గా చెబుతున్నాను కానీ, సబ్ కాన్షియస్ గా చాలామందిలో ఆ రెండు కులాల పట్ల పైన చెప్పిన కారణాల వల్ల ఒక హీరోయిక్ ఫీలింగ్ ఉందని నా అభిప్రాయం. అందుకే ఆ టైటిల్స్. అఫ్కోర్స్, వేరే ఏ కులం వారి సరసన నిలిచినా ఆ కులానికీ వస్తుంది ఆ ఫాలోయింగ్....
-సిరాశ్రీ

More Telugu News