: ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కిన ట్రంప్.. ఆఫ్ఘాన్‌కు మరిన్ని బలగాలు.. సమీప భవిష్యత్తులో యుద్ధానికి ముగింపు కష్టమే!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లతో అమెరికా చేస్తున్న యుద్ధం సమీప భవిష్యత్తులో అంతమయ్యేలా కనిపించడం లేదు. ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్థాన్‌కు మరిన్ని బలగాలు పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే 8,400 బలగాలు ఆఫ్ఘాన్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతుండగా మరో 3,400 బలగాలను పంపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ కూడా ఇందుకు అనుమతించింది.

అమెరికా చరిత్రలో అత్యంత సుదీర్ఘ యుద్ధంగా చరిత్ర కెక్కిన ఇది సమీప భవిష్యత్తులో అంతమయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే సుదీర్ఘ కాలం నుంచి తాలిబన్లపై యుద్ధం చేస్తున్నా ఇప్పటి వరకు వారిపై విజయం దక్కకపోవడం గమనార్హం. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రారంభించిన ఈ యుద్ధాన్ని బరాక్ ఒబామా కూడా కొనసాగించారు.

తాను ప్రారంభించిన యుద్ధాన్ని అతి త్వరలోనే ముగిస్తానని బుష్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. 2010-11లో ఒబామా ఆఫ్ఘాన్‌కు మరిన్ని బలగాలు  పంపి పటిష్ఠం చేశారు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లో ఏకంగా 98 వేల మంది అమెరికా సైనికులు మోహరించారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆఫ్ఘాన్‌లో తాలిబన్లతో యుద్ధం కోసం అమెరికా ఇప్పటి వరకు 800 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కాగా, తాను అధికారంలోకి వస్తే ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా దళాలను వెనక్కి పిలిపిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మరిన్ని బలగాలను అక్కడికి పంపిస్తుండడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News