: స్టాక్ మార్కెట్ కు 'యుద్ధ' భయం...18 రోజుల్లో 7,344 కోట్ల ఉపసంహరణ!

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఉత్తర కొరియా మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, భారత్‌-చైనాల మధ్య డోక్లాంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా యుద్ధం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల వ్యాఖ్యల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో పలువురు పెట్టుబడి దారులు తమ షేర్లు అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ఈ నెల 1-18 తేదీల మధ్య ఈక్విటీ మార్కెట్లలో సుమారు 7,344 కోట్ల రూపాయల (1.14 బిలియన్‌ డాలర్లు) విలువైన షేర్లను విదేశీ పోర్ట్‌ ఫోలియోలను మదుపర్లు (ఎఫ్‌పీఐలు) విక్రయించారు.

 ఇదే సమయంలో డెట్‌ ఫండ్స్ లో సుమారు 9,364 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. పెట్టుబడులకు సురక్షితమైన సాధనాలు వెతుక్కునే క్రమంలో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుందని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్ కి 53,610 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, ఈ నాలుగు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, డొల్ల కంపెనీలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)  తీసుకుంటున్న కఠిన చర్యలు కూడా విదేశీ మదుపర్లపై ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. 

More Telugu News