: తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం.. ఎన్డీయేలో జగన్ చేరికకు సర్వం సిద్ధం.. ఫలించిన ‘గాలి’ మధ్యవర్తిత్వం?

అనుకున్నదే అయిందా? బీజేపీతో చేతులు కలిపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అయ్యారా? అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ‘అత్యంత విశ్వసనీయ’ వర్గాలను ఉటంకిస్తూ ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు అయిన ఆర్ణబ్ గోస్వామికి చెందిన ‘రిపబ్లిక్ టీవీ’ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. జగన్ బీజేపీతో చేతులు కలపడానికి సర్వం సిద్ధమైందని పేర్కొంది. ఈ విషయంలో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించిందని తెలిపింది. జగన్‌ను ఆయన బీజేపీలోని ముగ్గురు ముఖ్యనాయకుల వద్దకు తీసుకెళ్లి చర్చలు జరిపారని వివరించింది. ఎన్డీయేలో చేరికకు జగన్ తన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేశారని చానల్ పేర్కొంది.  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి జగన్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, ప్రత్యేక హోదాపై కిమ్మనకుండా ఉండడం.. ఇవన్నీ అందులో భాగమేనని ‘రిపబ్లిక్ టీవీ’ తన కథనంలో పేర్కొంది.

వచ్చే ఎన్నికల్లో ఎవరితో వెళ్లాలనేది ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామని బీజేపీ కూడా చెబుతోంది. జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలను తేలిగ్గా తీసుకున్న ఓ బీజేపీ నేత మాట్లాడుతూ ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చే వారితోనే ఏపీలో కలిసి వెళ్తామని చెప్పడం ఈ వార్తకు మరింత ఊతమిస్తోంది. తమది పక్కా రాజకీయ పార్టీ అని, చంద్రబాబుతో లాభం ఉందనుకుంటే ఆయనతో కలిసి వెళ్తామని, లేదంటే మరో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో జగన్ చేరికకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ కథనం వెలువడినట్టు తెలుస్తోంది.
 

More Telugu News