: 65 ఏళ్లు కాపురం చేశారు... మ‌ర‌ణంలోనూ ఒక్క‌టి కావాల‌ని కారుణ్య మ‌ర‌ణాన్ని ఆశ్రయించారు!

నెద‌ర్లాండ్స్‌కు చెందిన నిక్‌, ట్రీస్ వృద్ధ జంట వయసు దాదాపు 90 ఏళ్లు... 65 ఏళ్లు కాపురం చేశారు. వ‌య‌సు పెరుగుతుండ‌టంతో వారికి తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. 2012లో నిక్‌కి తీవ్ర గుండెపోటు వ‌చ్చింది. ఈ మ‌ధ్య ట్రీస్‌కు కూడా డిమెన్షియా ఉన్న‌ట్లు తేలింది. దీంతో వాళ్లిద్ద‌రూ వ్యాధులతో ఎక్కువ కాలం ఇబ్బంది ప‌డ‌కుండా, క‌లిసి క‌న్నుమూయాల‌ని నిశ్చ‌యించుకున్నారు. అందుకోసం కారుణ్య మ‌ర‌ణం (యూతనేషియా) కోసం నెద‌ర్లాండ్స్‌ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. సంవ‌త్స‌రం విచార‌ణ త‌ర్వాత వీరి జంట కారుణ్య మ‌ర‌ణానికి ప్ర‌భుత్వానుమ‌తి ల‌భించింది.

 జూలై 4న చేతులు క‌లుపుకుని, ప‌క్క‌ప‌క్క‌నే ప‌డుకుని, డాక్టర్లు ఇచ్చిన మందు తీసుకుని ఒకేసారి ఈ జంట క‌న్నుమూసింది. క‌లిసి చ‌నిపోవాల‌నే వారి చివ‌రి కోరిక‌ను సాకారం చేసినందుకు వారి పిల్ల‌లు ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నెద‌ర్లాండ్స్‌ చ‌ట్టాల ప్ర‌కారం తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కారుణ్య మ‌ర‌ణానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ప్ర‌క్రియ‌లో డాక్ట‌ర్లు మందులు ఇచ్చి మ‌ర‌ణాన్ని ప్ర‌సాదిస్తారు. బెల్జియం, కొలంబియా, ల‌క్జెంబ‌ర్గ్ వంటి ఇత‌ర దేశాల్లో కూడా కారుణ్య మ‌ర‌ణాన్ని చ‌ట్ట‌రీత్యా అంగీక‌రిస్తారు.

More Telugu News