: సుప్రీం అరుదైన తీర్పు... అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేయనందుకు ప్రభుత్వానికి రూ. 10 లక్షల ఫైన్!

ఓ అత్యాచార బాధితురాలు గర్భం దాల్చగా, ఆమె కోరిక మేరకు అబార్షన్ చేయడంలో అలసత్వం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ మధ్యాహ్నం సుప్రీంకోర్టు అరుదైన తీర్పును ఇచ్చింది. బీహార్ ప్రభుత్వం బాధితురాలికి రూ. 10 లక్షలు జరిమానాగా చెల్లించాలని తీర్పిచ్చింది. ఈ తరహా తీర్పు రావడం దేశంలో ఇదే తొలిసారి. మరిన్ని వివరాల్లోకి వెళితే, భర్త నుంచి విడిపోయి, పాట్నా వీధుల్లో జీవనం సాగిస్తున్న 35 ఏళ్ల మహిళపై కొందరు అత్యాచారానికి ఒడిగట్టారు. దీన స్థితిలో నడిరోడ్డుపై ఉన్న ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ కాపాడింది.

వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీ సోకిందని, గర్భంతో ఉందని తేలడంతో, గర్భం తొలగించుకోవాలని భావించిన ఆమె, పాట్నా మెడికల్ కాలేజీకి వెళ్లింది. వారు నిర్లక్ష్యం చేయడంతో తొలుత హైకోర్టుకు వెళ్లింది. అక్కడ కేసు విచారణ ఆలస్యం కావడంతో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోగా, ఆమె 26 వారాల గర్భవతని, ఆ పరిస్థితుల్లో అబార్షన్ ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు తేల్చారు. ఇక కేసును విచారించిన న్యాయమూర్తులు దీపక్‌ మిశ్రా, ఖాన్‌ విల్కర్‌ లు నేడు తీర్పిస్తూ, ఆమెకు రూ. 10 లక్షలు ప్రభుత్వం అందించాలని, అత్యాచార బాధితుల సంక్షేమ నిధి నుంచి మరో రూ. 3 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు.

More Telugu News