: సౌదీ పేద మహిళకు ఉచితంగా సేవ చేసిన భారత డ్రైవర్... అది తెలిసి 'కారు కొనిస్తా'నన్న సౌదీ వ్యాపారి!

చేసిన మేలు ఊరికే పోదు.. అనే సామెత సౌదీలోని ఓ ప్రవాస భారతీయుడి విషయంలో అక్షరాలా నిజమయింది. దాని పూర్వాపరాల్లోకి వెళ్తే... బతుకుదెరువు కోసం ఒక భారతీయుడు సౌదీకి 22 ఏళ్ల క్రితం పొట్టచేతపట్టుకుని వలస వెళ్లాడు. మదీనాలో ఉంటూ కారును అద్దెకు తీసుకుని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తనకంటే పేదదైన వయసు మళ్లిన ఓ సౌదీ పౌరురాలిని చికిత్స కోసం వారంలో మూడు రోజులు తన కారులో తీసుకెళ్లేవాడు. ఆమె నుంచి ఏమీ తీసుకునేవాడు కాదు. ఆమె పేదరికం చూసి ఈ సహాయం చేస్తున్నానని చెప్పేవాడు.

ఈ విషయాన్ని ఆమె కుమార్తె సోషల్ మీడియాలో పంచుకుంది. అతని మంచి మనసును గురించి తన పేజ్ లో పేర్కొంది. ఇది నెటిజన్లను చూరగొంది. సౌదీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తుండగా...'ఓ మై ఇనిషియేటివ్' అనే స్థానిక స్వచ్చంధ సంస్థ ద్వారా సౌదీ కళాకారుడు, వ్యాపారవేత్త ఫయీజ్ అల్ మల్కీ అతని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సౌదీ పౌరుడు కాకున్నా, సొంత కారు లేకున్నా ఆయన చేసిన సాయానికి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయనకు కొత్త కారును బహూకరిస్తానని ప్రకటించారు. దీంతో ఆ భారతీయుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. సొంత కారుతో తన కష్టాలు తీరిపోతాయని చెబుతున్నాడు.

More Telugu News