: బోర్డర్ పర్సనల్ మీటింగ్‌కు చైనా ఆర్మీ డుమ్మా.. భారత ఆహ్వానానికి నో రెస్పాన్స్!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వాస్తవాధీన రేఖ వెంబడి లడఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో భారత్ ప్రతి ఏడాది నిర్వహించే బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం)కు ఈసారి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో భారత స్వాతంత్ర్య సంబరాలకు హాజరుకాకూడదని చైనా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15న బీపీఎం పాయింట్స్ అయిన దౌలత్ బేగ్ ఓల్దీ, లడఖ్‌లోని చూషుల్, అరుణాచల్ ప్రదేశ్‌లోని బుమ్ లా, కిబితు, సిక్కింలోని నాథులాలలో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సిందిగా పీఎల్‌ఏను ఆహ్వానించామని, అయితే అటు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

కాగా, ఆగస్టు 1న చైనా 90వ వార్షికోత్సవాలకు కూడా ఇండియన్ ఆర్మీ హాజరు కాలేదు. ఏడాదిలో ఇరు దేశాల ఆర్మీ మధ్య వివిధ బీపీఎం పాయింట్లలో ఏడెనిమిది వరకు ప్రత్యేక సమావేశాలు జరుగుతుంటాయని, అందులో భాగంగా ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, టీ పార్టీలు ఉంటాయని, కానీ మంగళవారం అది జరిగే అవకాశం కనిపించడం లేదని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News