: సినీ పరిశ్రమకు రాంగోపాల్ వర్మ ఏం చేశాడు?: నటుడు శివాజీ రాజా

తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేశాడో చెప్పాలని ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్రశ్నించాడు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, 'మా' నిర్వహించే ఒక్క కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనలేదని, సినీ కార్మికుల సంక్షేమం కోసం ఒక్కనాడూ ముందుకు రాలేదని అన్నాడు. తాను ఏ ఒక్క పని చేసినా చెప్పాలని, ఎవరినీ ఆదుకోని, ఎవరికీ సాయపడని ఆయన, వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే చేస్తాడని విమర్శించాడు. టాలీవుడ్ ను కుదిపేసిన మాదకద్రవ్యాల కేసులో, విచారణను నిలిపివేయాలని గానీ, రెండోసారి సినీ ప్రముఖులకు నోటీసులు వద్దనిగానీ, పరిశ్రమ తరఫున ఎన్నడూ ఒత్తిడి తేలేదని శివాజీ రాజా స్పష్టం చేశాడు.

ఈ విషయంలో పోలీసుల విచారణకు తనతో సహా మరెవరూ కల్పించుకోలేదని, అసలా ఉద్దేశమే లేదని తెలిపాడు. తాను అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చానని, మా అధ్యక్ష పదవి తనకు దక్కడం వెనుక పరిశ్రమ పెద్దలు ఉంచిన నమ్మకం కారణమని తెలిపాడు. సినీ కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపాడు. సినీ పరిశ్రమలో దళారులదే పూర్తిగా రాజ్యమని చెప్పలేనని, అయితే, దళారీ వ్యవస్థ గట్టిగానే పరిశ్రమలో పాతుకు పోయిందని వివరించాడు. దళారులను కట్ చేస్తే, మంచి హీరోయిన్లు, ఆర్టిస్టులు లభిస్తారని అభిప్రాయపడ్డాడు. 

More Telugu News