: గోరఖ్‌పూర్ విషాదం: ‘హీరో డాక్టర్’ ఖాన్‌పై వేటు.. నోడల్ ఆఫీసర్ పోస్ట్ నుంచి తొలగింపు!

సొంత డబ్బులతో మూడు ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేసి ‘హీరో’గా మారిన గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ (బీఆర్‌డీ) మెడికల్ కాలేజ్ వైద్యుడు డాక్టర్ కాఫిల్ ఖాన్‌పై అధికారులు వేటేశారు. ఎన్‌సెఫాలిటిస్ (మెదడు వాపు సంబంధిత) వార్డుకు నోడల్ ఆఫీసర్‌గా ఉన్న ఆయనను తొలగించారు. ఆసుపత్రికి లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడంతో సొంత డబ్బులు వెచ్చించి మూడు సిలిండర్లు కొనుగోలు చేసిన డాక్టర్ ఖాన్ సోషల్ మీడియాలో హీరోగా మారారు. ఆయనపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తాయి.

అయితే అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. ఆసుపత్రిలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయని, బయట నుంచి కొనుగోలు చేసి తీసుకు రావాల్సిన అవసరమే లేదని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేకే గుప్తా పేర్కొన్నారు. ఆగస్టు 10న రాత్రి ఆసుపత్రిలో 52  సిలిండర్లు ఉన్నాయని, అటువంటప్పుడు బయట నుంచి మూడు సిలిండర్లు కొనుగోలు చేసి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందన్న విషయం అర్థం కావడం లేదన్నారు. ఆయనలా ఎందుకు చేశారన్న విషయం తెలియడం లేదని, మెడికల్ కళాశాల అతడిని హీరోగా అభివర్ణించడం లేదని తేల్చి చెప్పారు. అదంతా మీడియా  సృష్టేనన్నారు.


కాగా, డాక్టర్ ఖాన్ ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చట్టవిరుద్ధంగా ప్రైవేటు క్లినిక్‌ను నిర్వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తనను నోడల్ ఆఫీసర్ పోస్ట్ నుంచి తప్పించడంపై ఖాన్ మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆపదలో ఉన్న చిన్నారులకు సాయం చేయాలనే సిలిండర్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.

More Telugu News