: చైనాది నాలుకా? ఇంకేమైనానా? ఉత్తర కొరియా విషయంలో శాంతి వచనాలు.. భారత్‌పై యుద్ధ ప్రేలాపనలు!

డ్రాగన్ కంట్రీ చైనా ద్వంద్వ ప్రవృత్తి మరోమారు బహిర్గతమైంది. తాము ఎలా కావాలంటే అలా మాట్లాడగలమని ప్రపంచానికి చాటిచెప్పింది. చైనా ద్వంద్వ విధానాలు తెలిసిన ప్రపంచం నివ్వెరపోతోంది. అమెరికా-ఉత్తర కొరియా మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశంపై కయ్యానికి కాలు దువ్వున్నారు. నేడో, రేపో యుద్ధం తప్పదన్నట్టు రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే అమెరికాను చేరుకోగల ఖండాతర క్షిపణులతో సిద్ధంగా ఉన్నామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు అమెరికా కూడా ఉత్తర కొరియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. తాము ‘ఫుల్లీ లోడెడ్’ క్షిపణులతో సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శనివారం మాట్లాడుతూ ఈ విషయలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. పరిస్థితులు మరింత చెడిపోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్‌కు సూచించారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు.

అదే సమయంలో డోక్లాం విషయంలో మాత్రం చైనా వెర్రి ప్రేలాపనలతో పరిస్థితులను మరింత క్లిష్టంగా మారుస్తోంది. చైనా మీడియా అయితే ఓ అడుగు  ముందుకేసి యుద్ధానికి సర్వం సిద్ధంగా ఉన్నామంటూ రోజుకో కథనాన్ని ప్రచురిస్తూ ఉద్రిక్తతలు పెంచుతోంది. డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి తగ్గకుంటే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వం కూడా హెచ్చరించింది. ఈ మేరకు ఆర్మీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా.. ఉత్తర కొరియా విషయంలో ఒకలా, భారత్ విషయంలో మరోలా మాట్లాడుతూ చైనా తన ద్వంద్వ  ప్రవృత్తిని ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపుతోంది.

More Telugu News