: తిరుమలలో తీవ్ర రద్దీ... తట్టుకోలేక క్యూలైన్లకు తాళాలు వేసిన టీటీడీ

నాలుగు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో తొలి రోజే తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఉదయం 8 గంటల సమయానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్టుమెంట్లూ నిండిపోగా, ఆపై గంట వ్యవధిలోనే భక్తుల క్యూ లైన్ 2 కిలోమీటర్లకు పైగా పెరిగిపోయింది. దీంతో భక్తుల రద్దీని తట్టుకోవడం క్లిష్టతరం కావడంతో టీటీడీ సిబ్బంది క్యూ లైన్లకు తాళాలు వేశారు. దీంతో ఎలాగైనా లైన్లలోకి చేరాలని పలువురు ఇనుప కంచెను దూకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

 మరోవైపు వేలాది మంది తాళాలు వేసిన ప్రాంతాల్లో తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. ఇంకోవైపు కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే నేటి 20 వేల టికెట్ల కోటా కూడా పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మరోపక్క వర్షం కూడా పడుతూ ఉండటంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని అద్దె గదులూ నిండిపోవడంతో షెడ్ల కిందే భక్తులు కాలం గడుపుతున్నారు. క్యూలైన్లతో పాటు పలు ప్రాంతాల్లో అన్న ప్రసాదాలను అందిస్తున్నామని, సాధ్యమైనంత ఎక్కువ మందికి స్వామి దర్శనాన్ని చేయిస్తామని, ఈ రద్దీ మంగళవారం వరకూ కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

More Telugu News