: అమెరికాకు రక్షణగా రంగంలోకి దిగిన జపాన్

అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై ఏ క్షణమైనా దాడికి దిగుతామని ఉత్తర కొరియా హెచ్చరించిన వేళ, గువామ్ ద్వీపాన్ని రక్షించేందుకు జపాన్ రంగంలోకి దిగింది. ఒకవేళ ఉత్తర కొరియా ఏవైనా క్షిపణులను గువామ్ పై ప్రయోగిస్తే సమర్థవంతంగా అడ్డుకునే దిశగా క్షిపణి విధ్వంసక వ్యవస్థను సిద్ధం చేసింది. పేట్రియాట్ పేరిట తయారైన ఈ వ్యవస్థ గాల్లోనే క్షిపణులను పేల్చేయగలుగుతుంది. పీఏసీ-3 (పేట్రియాట్ అడ్వాన్డ్స్ కాపబిలిటీ) వ్యవస్థలను క్షిపణి ప్రయాణించే మార్గమైన షిమానే, హిరోషిమా, కొచీ ప్రాంతాల్లో మోహరించినట్టు ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ఎన్ హెచ్కే వెల్లడించింది.

ఈ మేరకు టెలివిజన్ ఫుటేజ్ ని కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో మిలటరీ వాహనాలు భారీ యంత్ర సామాగ్రిని, లాంచర్లను తీసుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఉపరితలంపై నుంచి గాల్లోని మిసైళ్లను నాశనం చేసే క్షిపణులతో పాటు, జలాంతర్గాముల నుంచి క్షిపణులను పేల్చే సిస్టమ్ ను కూడా జపాన్ సిద్ధంగా ఉంచింది. కాగా, అమెరికా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ క్షణం ఉత్తర కొరియా విరుచుకుపడుతుందోనన్న ఆందోళన సర్వత్ర నెలకొంది.

More Telugu News