: యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ... రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి!

ఓ వైపు అమెరికా, ఉత్తర కొరియాల మధ్య, మరోవైపు ఇండియా, చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, గడచిన ఐదు రోజుల వ్యవధిలో రూ. 6 లక్షల కోట్లకు పైగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. ఇటీవలే 10 వేల పాయింట్ల మార్క్ ను నిఫ్టీ దాటగా, ఆ ఆనందం పట్టుమని పది రోజులు కూడా ఇన్వెస్టర్లకు మిగల్లేదు. మూడో ప్రపంచయుద్ధం రానుందన్న భయాలు సెన్సెక్స్ ను ఐదు రోజుల వ్యవధిలో 1,100 పాయింట్లు పడగొట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా పడిపోయింది.

విదేశీ మార్కెట్ల తీరు కూడా ఇదే విధంగా ఉండటంతో మరింత కాలం పాటు మార్కెట్ అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ఆల్ టైం రికార్డు స్థాయులకు దగ్గరగా ఉన్న సెన్సెక్స్, నిఫ్టీలు ప్రస్తుతం నెల రోజుల కనిష్ఠానికి దిగజారాయి. శుక్రవారంతో ముగిసిన వారాంతానికి సెన్సెక్స్, నిఫ్టీలు మూడున్నర శాతం నష్టాలను నమోదు చేసుకున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి తరువాత ఒక వారంలో ఇంత భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక ప్రపంచ మార్కెట్లు ఈ ఐదు రోజుల వ్యవధిలో ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోయాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

More Telugu News