: 85 ఏళ్ల క్రికెట్ చరిత్రలో భారత్ కల నెరవేరేనా?!

85 సంవత్సరాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ సాధ్యం కాకుండా, కలలా మిగిలిపోయిన రికార్డు ఇప్పుడు విరాట్ కోహ్లీ సేన ముందు నిలిచింది. ఈ ఎనిమిదిన్నర దశాబ్దాల కాలంలో భారత జట్టు ఎన్నడూ విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ ను వైట్ వాష్ చేసి గెలవలేదు. ఇక ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ ల సిరీస్ జరుగుతుండగా, ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు నేటి నుంచి క్యాండీలో మూడో టెస్టును ఆడనుంది. ఇక ఈ టెస్టును కూడా గెలుచుకుంటే, పటౌడీ నుంచి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ తదితర దిగ్గజాలకెవరికీ సాధ్యం కాని అరుదైన ఘనత విరాట్ కోహ్లీకి దక్కుతుంది. అయితే, క్యాండీలో పిచ్ పేస్ బౌలర్లకు సహకరించేలా కనిపిస్తుండటంతో విజయం అంత సులువేమీ కాదన్నది క్రీడా పండితుల అంచనా.

కాగా, నిన్న కురిసిన వర్షంతో పిచ్ మరింత గట్టిగా మారి బంతి ఇంకా వేగంగా దూసుకొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గాయాల బారినపడ్డ నువాన్ ప్రదీప్, రంగన హెరాత్ ల స్థానంలో పేస్ బౌలర్లు చమీర, గమాగేలను లంక జట్టులోకి తీసుకోగా, రవీంద్ర జడేజాపై సస్పెన్షన్ వేటు పడటంతో కులదీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు మూడో పేసర్ రూపంలో అవకాశం దక్కవచ్చని అంచనా.

ఇదిలావుండగా, టెస్టుల్లో ఇప్పటివరకూ భారత జట్టు నాలుగు సార్లు వైట్ వాష్ చేసింది. మహ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో 1993లో ఇంగ్లండ్ ను, 1994లో శ్రీలంకను వైట్ వాష్ చేసిన భారత జట్టు, ధోనీ కెప్టెన్సీలో 2013లో ఆస్ట్రేలియాను, కోహ్లీ నేతృత్వంలో 2016లో న్యూజిలాండ్ పైనా ఇదే ఫీట్ ను సాధించింది. అయితే, ఇవన్నీ సొంత గడ్డపై మాత్రమే.

More Telugu News