: పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన దక్షిణ కొరియా!

దాయాది దేశం పాకిస్థాన్ కు దక్షిణ కొరియా ఊహించని షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్ లలో పెట్టుబడులను పెట్టేందుకు నిరాకరించింది. ఈ ప్రాంతంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు గతంలో దక్షిణ కొరియా ఆసక్తి చూపింది. అయితే, వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో పెట్టుబడులను పెట్టలేమంటూ ఇప్పుడు స్పష్టం చేసింది. దీంతో విదేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలనే ప్రయత్నాల్లో ఉన్న పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

ఈ రెండు ప్రాంతాలు అధికారికంగా ఇంకా పాకిస్థాన్ లో చేరలేదు. ఇక్కడ నివసిస్తున్న ప్రజల పౌరసత్వం విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ భూభాగం మొత్తం తమదే అని భారత్ వాదిస్తోంది. ఈ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పనులపై కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో చేపడుతున్న పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చట్టపరంగా కూడా సంక్లిష్టతలు ఉన్నట్టు దక్షిణ కొరియా భావిస్తోంది. దీంతో, పెట్టు బడులు పెట్టాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

జీలం నదిపై 500 మెగావాట్ల చకోతి హతియన్ హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్ఘిక సాయం చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ డీలిమ్ ఇండస్ట్రియల్ కంపెనీ లిమిటెడ్ గతంలో ముందుకు వచ్చినప్పటికీ, ఇప్పుడు వెనకడుగు వేసింది. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, కొరియా ఎగ్జిమ్ బ్యాంక్ లు నిరాకరించాయి. కొరియా నిర్ణయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చేపట్టిన కోహలా జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. కొరియా తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాక్ లో ఉన్న కొరియా పౌరులపై కూడా దాడులు జరుగుతున్నాయి. అయినా, కొరియా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

More Telugu News