: పాకిస్థాన్ ప్రధాని పదవిపై కన్నేసిన ఉగ్రవాది హఫీజ్ సయీద్?

ముంబై దాడుల సూత్రధారి, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ప్రధాని కావాలని కలలు కంటున్నాడు. అందులో భాగంగానే పాకిస్థాన్‌ ను నిజమైన ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్న ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ భావజాలాన్ని నినాదంగా ఎత్తుకున్నాడు. ఈ నేపథ్యంలో తనపై ఉన్న ఉగ్రవాది ముద్రను చెరిపేసేందుకు రాజకీయ పార్టీ వ్యూహాన్ని రచించాడు. నవాజ్ షరీఫ్‌ పై అనర్హత వేటు పడటంతో ఆయన నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ సమస్యల్లో చిక్కుకుంది. నిధులు స్వాహా చేశారన్న అనుమానాల నేపథ్యంలో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గింది. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్‌ స్త్రీలోలుడు అంటూ మహిళా ఎంపీ చేసిన ఫిర్యాదుతో నమోదైన కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై కూడా ప్రజలకు నమ్మకం కుదరడం లేదు. ఇక భుట్టో కుటుంబం గతచరిత్రలో కలిసిపోయింది.

 ఈ నేపథ్యంలో 2018 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించగలిగితే దేశ ప్రధాని పదవి చేతుల్లో ఇమిడిపోతుంది. దీంతోనే మిల్లి ముస్లిం లీగ్ పార్టీ ప్రకటన చేశాడు. ఆ పార్టీకి హఫీజ్ సయీద్ అధ్యక్షుడని చెబుతూ అతని స్నేహితుడు సైపుల్లా ఖలీద్ ప్రకటించాడు. కాగా, హఫీజ్ సయీద్ గృహ నిర్బంధం నుంచి విడుదలైన తరువాత ఆయనే పూర్తి బాధ్యతలు చేపడతారని, ప్రస్తుతం తమ పార్టీ అధికార ప్రతినిధిగా మరో ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా కార్యకర్త తబిష్ ఖయూమ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపాడు. హఫీజ్ సయీద్ కలలు నెరవేరితే భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ భద్రతకు పెను ముప్పు పొంచి వుంటుంది. అణ్వాయుధ దేశమైన పాకిస్థాన్ కు ఉగ్రవాది అధినేతగా భాధ్యతలు చేపడితే జరిగే ప్రమాదాన్ని ఊహించడానికి కూడా సాధ్యం కాదని, ఈ మేరకు తెరవెనుక ప్రయత్నాలను హఫీజ్ సయీద్ ప్రారంభించాడని వార్తలు వెలువడుతున్నాయి. 

More Telugu News