: చెన్నై నరకకూపంగా మారింది: లైంగికదాడి, హత్యకు గురైన అమ్మాయి తండ్రి ఆవేదన

చైన్నై సిటీ నరకకూపంగా మారిందంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నైలో తన కుటుంబంతో కలసి ఎంతో హాయిగా జీవిస్తున్న రాజేష్ జీవితం ఫిబ్రవరిలో తలకిందులైపోయింది. తమ పొరుగున ఉన్న ఓ 23 ఏళ్ల నీచుడు చేసిన పనికి రాజేష్ కుటుంబం సర్వనాశనం అయిపోయింది. రాజేష్ ఏడేళ్ల కుమార్తెను తన ఇంట్లోకి తీసుకెళ్లిన ఆ కామాంధుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్య చేశాడు. అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని తగలబెట్టాడు. ఈ ఘటనతో రాజేష్ కుటుంబం అతలాకుతలమైంది. ఆయన భార్య ఇప్పటికీ ఆ ఘటన నుంచి తేరుకోలేకపోయింది. ఐదేళ్ల ఆయన కుమారుడు ఇప్పటికీ ఆ దారుణ ఘటన గురించి భయపడుతూనే ఉన్నాడు. అక్క కోసం ఏడుస్తూనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలో, తన సర్వస్వం అయిన కూతురును అంతం చేసిన ఆ నీచుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నైలోని మంగాడు పోలీస్ స్టేషన్ కు గత ఆరు నెలల్లో ఎన్నోసార్లు వెళ్లానని రాజేష్ చెప్పాడు. అయినా ఇంత వరకు చార్జ్ షీట్ కూడా వేయలేదని వాపోయాడు. ఈ ఆరు నెలల కాలంలో కమిషనర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఎందరో మారిపోయారని... కొత్తగా వచ్చిన ప్రతి అధికారికి జరిగిన ఘటన గురించి వివరిస్తూనే వచ్చానని, ప్రతిసారి కన్నీరు కారుస్తూనే ఉన్నానని, కానీ ఇంత వరకు పోలీసుల వైపు నుంచి ఎలాంటి యాక్షన్ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఏపీలోని తన సొంతూరుకు తన కుటుంబాన్ని తీసుకెళ్లిపోయానని చెప్పాడు.  

తన కుమార్తెను హత్య చేసినవాడిని చంపేద్దామనుకున్నానని... అయితే వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, చట్ట ప్రకారమే పోరాడుతానని రాజేష్ చెప్పాడు. జరిగిన దానిని మర్చిపోయే ప్రయత్నం చేయాలని, జీవన ప్రయాణంలో ముందుకుసాగాలని తనకు తన బంధువులు, స్నేహితులు చెబుతున్నారని... అయితే ఈ నీచుడిని ఇంతటితో వదిలేస్తే, మరో చిన్నారి జీవితాన్ని నాశనం చేస్తాడని అన్నాడు. ఆ నీచుడికి మరణశిక్షను విధించాలని డిమాండ్ చేశాడు. ఇప్పటికే నేరస్తుడైన ఇతను, పదేళ్ల పాటు జైల్లో ఉంటే మరింత రాటుదేలుతాడని చెప్పాడు.

చెన్నైలో అయితే పిల్లలకు మంచి చదువు ఉంటుందనే భావనతోనే ఇక్కడకు వచ్చామని... అయితే, పిల్లలకు రక్షణే లేకపోతే చెన్నైలో ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. ఇప్పుడు తన కుమారుడు తన ఊర్లోని స్కూలుకు వెళుతున్నాడని... గ్రామాలే సురక్షితమని చెప్పాడు. తనను అర్థం చేసుకున్న తాను పని చేస్తున్న సంస్థ విదేశాలకు వెళ్లడానికి కూడా తనకు ఆఫర్ ఇచ్చిందని... అయితే, తన కుమార్తెకు న్యాయం జరిగిన తర్వాత, ఆ నీచుడిని ఉరి తీసిన తర్వాతనే తాను చెన్నైను వదిలిపెడతానని చెప్పాడు.

మరోవైపు, కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ, ఈ వారంలో నిందితుడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు.  

More Telugu News