: ఆత్మాహతి దాడికి వచ్చి చివరి క్షణంలో చిక్కిన యువ ఉగ్రవాది!

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్ లో విస్తరిస్తోందన్న అనుమానాలకు ఇప్పుడు మరిన్ని సాక్ష్యాలు లభించాయి. శిఖర్ పూర్ లోని మసీదు వద్దకు వచ్చి ఆత్మాహుతిదాడికి ప్రయత్నించబోయి, పట్టుబడిన 18 ఏళ్ల ఉస్మాన్ అనే యువకుడిని విచారించిన పోలీసులు, ఉగ్ర సంస్థ విస్తరిస్తున్న విషయాన్ని గుర్తించారు. గతంలో తమ దేశంలో ఓ యంత్రాంగంలేని మధ్యప్రాచ్య ఉగ్రవాద సంస్థకు ఇప్పుడు అభిమానుల సంఖ్య పెరిగిందని, వారి ద్వారా తమ కార్యకలాపాలను సాగిస్తోందని పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధికారి రాజా ఉమర్‌ ఖట్టాబ్‌ వెల్లడించారు.

కాగా, భాష తెలియని కారణంగానే ఉస్మాన్ దొరికిపోయినట్టు తెలుస్తోంది. ఉగ్ర శిక్షణ కోసం కాందహార్ మీదుగా దక్షిణ బెలూచిస్థాన్ ఎడారి ప్రాంతంలోని వాధ్ పట్టణానికి వెళ్లిన ఉస్మాన్ కు గ్రనేడ్ లు, ఆత్మాహుతి జాకెట్లు ఇచ్చిన ఉగ్రవాదులు, అక్కడికి 250 కిలోమీటర్ల దూరంలోని శిఖర్ పూర్ కు పంపారు. షియా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వేళ, తనను తాను పేల్చుకోవాలన్నది ఉస్మాన్ ఆలోచన. మసీదు వద్ద ఉస్మాన్ ను పలకరించిన ఓ వ్యక్తి స్థానిక సింధీ భాషలో ఏదో అడగటంతో, ఆ భాష తెలియక సరైన సమాధానాన్ని చెప్పలేకపోయాడు. దీంతో అనుమానం వచ్చిన అతను, మిగతావారి సాయంతో తనను తాను పేల్చుకోకముందే ఉస్మాన్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

More Telugu News