: తెలంగాణలో భూ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ కీలక నిర్ణయం

ఇటీవలి కాలంలో తెలంగాణలో భూదందాలు పెరగడంతో, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని భూ దస్త్రాలన్నింటిని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయాలని, ఇందుకోసం సమగ్ర భూ సర్వే చేయాలని ఆదేశించారు. ఏ భూమి ఎవరి పేరిట ఉందో నిగ్గు తేల్చి బహిరంగ పరచాలని, ఇందుకోసం ప్రత్యేక సర్వే నిర్వహించి సెటిల్‌మెంట్‌ చేయాలని, ఇకపై భూముల లావాదేవీలు పూర్తి పారదర్శకంగా సాగాలని, ఎక్కడా విమర్శలు రాకుండా చూసుకోవాలని ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో కేసీఆర్ అధికారులకు తెలిపారు.

పట్టాదారు పాస్‌ పుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత సరళంగా ఉండాలని పిలుపునిచ్చారు. మొత్తం సర్వే పారదర్శకంగా సాగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,850 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే నిర్వహించాలని ఆదేశించిన ఆయన, ఒక్కో రెవెన్యూ అధికారికి మూడేసి గ్రామాల బాధ్యతలు అప్పగిస్తామని, ఇకపై భూములకు ప్రత్యేక సంఖ్యలు కేటాయిస్తామని అన్నారు. పాస్‌ పుస్తకాలు, భూ వివాదాలు, హత్యలకు తెర దించుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా సర్వే జరగాలని, ఇందుకోసం సర్వే ఆఫ్‌ ఇండియాతోపాటు దేశంలోని వివిధ సర్వే ఏజెన్సీల సహకారం తీసుకోవాలని సూచించారు. భూమి పెరగదని, తగ్గదని గుర్తు చేసిన కేసీఆర్, అది ఎవరి పేరిట ఉందో తేలిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఒక్కో గ్రామంలో 15 రోజుల్లో సర్వే పూర్తి కావాలని, అధునాతన సాంకేతిక పరికరాలు వాడాలని ఆదేశించారు. ఇకపై ఎక్కడ భూ యాజమాన్య మార్పు జరిగినా, అన్ లైన్ లోనే రికార్డులు మారాలని అన్నారు.

More Telugu News