: అమ్మాయి వెంటపడి వేధిస్తే స్టేషన్ బెయిల్... క్రిమినల్ లాపై పెరుగుతున్న విమర్శలు!

తన మానాన తాను వెళుతున్న ఓ అమ్మాయి వెంటపడి, వేధింపులకు గురి చేసి, రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోతే ఏం జరుగుతుంది? జైలుకు వెళ్లాల్సి వస్తుందని అనుకుంటున్నారా? అంత సీను లేదు. పోలీసులకు పట్టుబడినా స్టేషన్ నుంచి ఎంచక్కా ఇంటికి వచ్చేయవచ్చు. వెంటపడి వేధించే కేసులో తొలిసారిగా చిక్కితే స్టేషన్ బెయిల్ పొందవచ్చని 'క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు 2012' చెబుతోంది. ఇప్పుడీ చట్టంపై మహిళా సంఘాలు, ఎంతో మంది అభ్యుదయవాదులు తమ నిరసనలను తెలియజేస్తున్నారు.

అసలు ఇప్పుడీ చట్టం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే, గత వారంలో హర్యానా బీజేపీ చీఫ్ కుమారుడు వికాస్ బారాలా, ఐఏఎస్ అధికారి కుమార్తె అయిన ఓ యువతి కారును వెంబడించి, వేధిస్తూ, పోలీసులకు అడ్డంగా దొరికిపోయి అరెస్టై, ఆపై అదే రోజు స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం నాడు ఈ ఘటన జరిగింది.

ఇక నాలుగేళ్ల నాడు... అంటే 2013లో ఇదే చట్టానికి మార్పులు తెచ్చి వేధింపుల కేసులు నాన్ బెయిలబుల్ నేరంగా మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నించిన వేళ, అలా చేస్తే పురుషులను జైళ్లకు పంపేందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరువాత ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిషన్ ఇచ్చిన సిఫార్సులు పూర్తిగా అమల్లోకి రాకపోగా, తొలి నేరానికి మాత్రం స్టేషన్ బెయిల్ ను వర్తింపజేస్తూ చట్టం వచ్చింది. ఇప్పుడా చట్టమే బీజేపీ నేత కుమారుడిని జైలుకు వెళ్లనీయకుండా అడ్డుకుంది. ఇప్పుడా చట్టాన్ని మరోసారి మార్చాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది.

More Telugu News