: సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వండి.. సెన్సార్ సంగతి మీకెందుకు?: సెన్సార్‌బోర్డుపై ఆమిర్ ఖాన్ ఫైర్

పహ్లాజ్ నిహలానీ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. నిహలానీ వివాదాస్పద నిర్ణయాలతో ఇప్పటికే మండిపడుతున్న బాలీవుడ్ మరోమారు బోర్డుపై తీవ్రస్థాయిలో విరుకుపడింది.
నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘బాబుమోషాయ్ బందూక్‌బాజ్’ సినిమాలో సెన్సార్ బోర్డు ఏకంగా 48 కట్‌లు చెప్పడంతో బోర్డు తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ చిన్నపట్టణంలో గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరిగే ఈ కథ విషయంలో సీబీఎఫ్‌సీ వ్యవహరించిన తీరును బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది.

కాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్ తాజాగా సెన్సార్ బోర్డుపై దుమ్మెత్తి పోశాడు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’  సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ సెన్సార్ బోర్డుపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బోర్డు తనపని తాను చేసుకుంటే మంచిదని సూచించాడు. బోర్డు పని సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రమేనని, ఆ పనిచేసుకుని సెన్సార్ సంగతిని తమకు వదిలేయాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు.

‘‘నాకు తెలిసినంత వరకు సెన్సార్ బోర్డు పని సర్టిఫికెట్ ఇవ్వడం వరకే. సెన్సార్ చేయడం కాదు’’ అని పేర్కొన్నాడు. సినిమాలకు గ్రేడ్ ఇవ్వడమే దాని విధి అని స్పష్టం చేశాడు. శ్యామ్‌బెనగల్ ప్రతిపాదనలు ఆ విషయాన్నే చెబుతున్నాయని పేర్కొన్నాడు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని ఆమిర్ వ్యక్తం చేశాడు.

More Telugu News