: విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామా.. రూ. 50 లక్షలతో డీల్: సీపీ మహేందర్ రెడ్డి

మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ విక్రమ్ గౌడ్ కాల్పుల డ్రామా కలకలం రేపిన విషయం తెలిసిందే. తనపై కాల్పులకు తానే స్కెచ్ గీసుకున్న విక్రమ్ గౌడ్ వ్యవహారం గురించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ఈ రోజు మీడియాకు వివరించి చెప్పారు. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో 9 మందిని నేరస్థులుగా గుర్తించామని, నిందితుల కోసం ఐదు రాష్ట్రాల్లో గాలించి మరీ పట్టుకున్నామని చెప్పారు. విక్రమ్ గౌడ్ సహా ఆరుగురిని కస్టడీలోకి తీసుకోగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. ఈ కేసులో ఎ1 విక్రమ్ గౌడ్, ఎ2 నందు, ఏ3 అహ్మద్ ఖాన్, ఎ4 రయీస్ ఖాన్, ఎ5 బాబూ జాన్, ఎ6 గోవిందరెడ్డి నిందితులుగా ఉన్నారని చెప్పారు. విక్రమ్ గౌడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేస్తామని తెలిపారు.

తనపై కాల్పుల ప్లాన్ కు నాలుగు నెలల క్రితమే విక్రమ్ గౌడ్ ఓ ప్రణాళిక సిద్ధం చేశారని, ఎవరెవరు ఏం చేయాలనే విషయమై కూడా పక్కాగా సిద్ధం చేసుకున్నారని అన్నారు. మొత్తం రూ.50 లక్షలకు ఈ ఒప్పందం కదుర్చుకున్నారని చెప్పారు. ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా విక్రమ్ గౌడ్ కు నిందితుడు గోవిందరెడ్డి పరిచయమయ్యాడని, సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి అతన్ని విక్రమ్ గౌడ్ ప్రలోభపెట్టాడని చెప్పారు. కాల్పుల డ్రామాలో భాగంగా గోవిందరెడ్డికి రూ.5 లక్షలను విక్రమ్ గౌడ్ ఇచ్చారని అన్నారు.

మరో నిందితుడు నందకుమార్ ను విక్రమ్ గౌడ్ కు పరిచయం చేసింది గోవిందరెడ్డేనని అన్నారు. ఈ కేసులో నిందితులు జులై 6న విమానంలో ఇండోర్ వెళ్లారని, రూ.30 వేలతో ఓ తుపాకీ, తూటాలు కొనుగోలు చేశారని చెప్పారు. జులై 8న విక్రమ్ గౌడ్ కు ఈ తుపాకీ అందిందని, జులై 17న పుట్టపర్తికి విక్రమ్ గౌడ్ వెళ్లారని తెలిపారు. జులై 21న విక్రమ్ గౌడ్ ఇంట్లోనే ఆయన్ని నిందితులు కలిశారని, తనపై కాల్పులు ఏ విధంగా జరపాలనే ప్లాన్ ను ఆ రోజే నిర్ణయించారని చెప్పారు.

మూడు రౌండ్ల కాల్పులు జరపాలని విక్రమ్ సూచించాడని, ఒకవేళ తన భార్య కానీ, వాచ్ మెన్ కానీ వస్తే వారిని బెదిరించేందుకు గాల్లోకి ఓ రౌండ్ కాల్చమని విక్రమ్ వారికి చెప్పాడని తమ దర్యాప్తులో తెలిసిందని అన్నారు. నిందితుల కోసం రూ.30 వేలు ఖర్చు పెట్టి ఓ బైక్ కూడా కొనుగోలు చేశారని, ఆ బైక్ ఇంజిన్, ఛాసిస్ నెంబర్లను నిందితులు చెరిపివేశారని అన్నారు. జులై 26వ తేదీనే తనపై కాల్పులు జరిపేందుకు విక్రమ్ నిర్ణయించాడని, అపోలో ఆసుపత్రి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లోనే నిందితులు బస చేశారని, అయితే, కొందరు నిందితులు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారని అన్నారు.

ప్లాన్ అమలు చేసేందుకు షూటర్ రయీస్ ఖాన్ ను షేక్ అహ్మద్ పిలిపించాడని, 28వ తేదీ తెల్లవారుజామున నిందితులతో విక్రమ్ గౌడ్ భేటీ అయ్యాడని అన్నారు. నిందితులను విక్రమ్ గౌడ్ తన కారులోనే  ఇంటి వరకు తీసుకొచ్చారని, వాచ్ మెన్ తన గదిలోకి వెళ్లిపోగానే వారిని ఇంట్లోకి తీసుకువెళ్లారని చెప్పారు. తనపై షూట్ చేసిన తర్వాత నిందితులు ఏ మార్గంలో పారిపోవాలో విక్రమ్ గౌడ్ చెప్పారని,  ఆ మార్గాన్ని రెండు సార్లు వారికి చూపించారని, కాల్పుల అనంతరం ఆ తుపాకీని పారవేయదలచిన ప్రాంతాన్ని కూడా విక్రమ్ గౌడ్ ముందుగానే వారికి చూపించినట్టు చెప్పారు.

ముందస్తు ప్లాన్ ప్రకారమే, విక్రమ్ గౌడ్ పై రయీస్ ఖాన్ రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని అన్నారు. మూడో రౌండ్ కాల్చేటప్పుడు రయీస్ ను పారిపొమ్మని విక్రమ్ ఆదేశించాడని, మొత్తం ఐదు రౌండ్ల బుల్లెట్లు లోడ్ చేశారని చెప్పారు. కాల్పుల అనంతరం నిందితులు రయీస్, షేక్ అహ్మద్ లు పల్సర్ వాహనంపై పరారయ్యారని, వారు ధరించేందుకు హెల్మెట్లు కూడా విక్రమ్ గౌడ్ అందజేశారని మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఉదయమే హకీంపేట చెరువు నుంచి విక్రమ్ గౌడ్ పై కాల్చిన తుపాకీని స్వాధీనం చేసుకున్నామని  చెప్పారు.

విక్రమ్ గౌడ్ భార్య షిపాలికి కూడా ఈ ప్లాన్ గురించి ఆయన చెప్పలేదని, ప్రజల సానుభూతి కోసమే విక్రమ్ గౌడ్ ఈ కాల్పుల డ్రామా ఆడారని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా గెలవాలన్న కోరికతోనే విక్రమ్ తనపై కాల్పుల డ్రామా ప్లాన్ వేశాడని, ఈ మేరకు ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేశామని మహేందర్ రెడ్డి చెప్పారు. 

More Telugu News