: ముంబైలో అరుదైన వజ్రాన్ని దొంగిలించిన చైనా దొంగల్ని పట్టేశారు!

ఇద్దరు చైనా దొంగలు, ముంబైలోని ఓ వజ్రాభరణాల ప్రదర్శన నుంచి విలువైన వజ్రాన్ని దొంగిలించగా, ఆపై మూడు గంటల వ్యవధిలోనే వారిని ఎయిర్ పోర్టు పోలీసులు పట్టేశారు. ప్రదర్శనలోని పీ కీర్తిలాల్‌ అండ్‌ కో స్టాల్‌ నుంచి సుమారు రూ. 34 లక్షల విలువైన వజ్రాన్ని తెలివిగా దొంగిలించి, దాని స్థానంలో నకిలీ వజ్రాన్ని వీరు ఉంచారు. ఆపై ఢిల్లీ మీదుగా హాంకాంగ్ కు వెళ్లేందుకు విమానం టికెట్లు బుక్ చేసుకున్నారు. వజ్రం దొంగిలించబడిన విషయాన్ని గుర్తించిన కీర్తిలాల్ ఉద్యోగులు, విషయాన్ని సెక్యూరిటీకి, ఆపై పోలీసులకు వెల్లడించారు.

తమ స్టాల్ కు వచ్చిన చైనా దొంగలు దీన్ని దొంగిలించినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో గమనించి దాన్ని వారికి ఇవ్వడంతో ఎయిర్ పోర్టుపై నిఘా ఉంచారు. ఆపై వీరిద్దరూ ఎయిర్ పోర్టుకు రాగా, సీఐఎస్‌ఎఫ్‌, ఇమ్మిగ్రేషన్‌ అధికారుల సమన్వయం వారిని పట్టించింది.  ఓ చిన్న షాంపూ బాటిల్‌ లో వారు దాచిన 5.4 క్యారెట్ల వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నామని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. కాగా, గోరేగావ్‌ లో ఇండియా ఇంటర్నేషనల్‌ జుయల్లరీ షో-2017 పేరిట ఈ ప్రదర్శన జరుగగా, ప్రవేశానికి రూ. 9 వేలు చెల్లించి మరీ వీరు దొంగతనం చేయడం గమనార్హం.

More Telugu News