: త్వ‌ర‌లో పేటీఎం నుంచి మేసేజింగ్ సేవ‌లు?

వాట్సాప్ త‌ర‌హాలో మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపించుకునేందుకు వీలుగా త్వ‌ర‌లో పేటీఎం కూడా ఓ మెసేజింగ్ స‌ర్వీస్ యాప్‌ను మార్కెట్లోకి తీసుకువ‌స్తున్న‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారికంగా ఎలాంటి స్ప‌ష్ట‌త లేక‌పోయినా, మ‌రో మూడు నెల‌ల్లో పేటీఎం మెసేజింగ్ యాప్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని పేటీఎం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ యాప్ పేరు చెప్ప‌డానికి వారు ఇష్ట‌ప‌డ‌లేదు. ఇదిలా ఉండ‌గా వాట్సాప్ కూడా మెసేజింగ్ స‌ర్వీస్‌తో పాటు డిజిట‌ల్ పేమెంట్ల‌ను కూడా త‌మ యాప్ ద్వారా చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ విష‌యమై వాట్సాప్ ప్ర‌తినిధి బ్ర‌యాన్ యాక్ట‌న్‌, కేంద్ర ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ను గ‌త ఫిబ్ర‌వరిలో క‌లిశారు. అంతేకాకుండా దేశీయ మెసేజింగ్ స‌ర్వీస్ యాప్ `హైక్‌` కూడా డిజిట‌ల్ పేమెంట్ల‌ను ప్రోత్స‌హించే స‌దుపాయం క‌ల్పించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా పేటీఎం, వాట్సాప్ వినియోగ‌దారులు దాదాపుగా స‌మానంగా ఉన్నారు. దీంతో ఇవి రెండు త‌మ కొత్త సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ద్వారా పెరిగే పోటీ వ‌ల్ల వినియోగ‌దారుల‌కు మ‌రింత మేలు చేకూరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

More Telugu News