: ఇండియాతో పెట్టుకుంటే వినాశనం తప్పదు: చైనాను హెచ్చరించిన ఆ దేశ మిలిటరీ ఎక్స్ పర్ట్

సిక్కిం సరిహద్దులోని డోక్లాం స్టాండ్ ఆఫ్ కారణంగా భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో, చైనాకు ఆ దేశ మిలిటరీ ఎక్స్ పర్ట్ ఆంటొనీ వోంగ్ హెచ్చరికలు జారీ చశారు. చైనా తీసుకుంటున్న రాజకీయ పరమైన చర్యలు భారత్ ను మనకు మరింత దూరం చేస్తాయని, చివరకు ఆ దేశం తమను శత్రుదేశంగా భావించే పరిస్థితి తలెత్తుతుందని ఆయన అన్నారు.

భారత్ పై చైనా మానసిక యుద్ధాన్ని చేస్తోందని... భూతలంపై జరిగే యుద్ధంలో భారత్ ను చైనా ఓడించగలిగినా... భారత నేవీని ఎదుర్కొనే సత్తా చైనాకు లేదని వోంగ్ తేల్చి చెప్పారు. హిందూ మహాసముద్రంలో జల రవాణాను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తో పెట్టుకుంటే ఇంధన జీవనదానాన్ని చైనా కోల్పోయినట్టేనని హెచ్చరించారు.

వాస్తవానికి ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి చైనా ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో 80 శాతం వరకు రవాణా హిందూ మహాసముద్రంలోని మలక్కా జలసంధి ద్వారానే జరుగుతోంది. ఆసియాలోని తూర్పుదక్షిణ దేశాలలో పోల్చితే భారత్ చాలా విభిన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు. భౌగోళికంగా ఇండియా చాలా కీలకమైన ప్రాంతంలో ఉందని... చైనాకు అత్యంత కీలకమైన 'బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్', ఎనర్జీ లైఫ్ లైన్లను నియంత్రించగలిగే ప్రదేశంలో ఇండియా ఉందని ఆయన చెప్పారు. భారత్ ను రెచ్చగొడితే, ఆ దేశం వైరి వర్గంలో చేరే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే శత్రు దేశాలన్నీ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధిలో చైనా ఆధిపత్యాన్ని వీలైనంత మేరకు తగ్గించే ప్రయత్నంలో ఉన్న సంగతిని గుర్తు చేశారు. భారత్ తో స్నేహపూర్వకంగా ఉంటేనే చైనాకు మేలు జరుగుతుందని హితవు పలికారు.

More Telugu News